
సాక్షి, కరీంనగర్: ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తడబడ్డారు. గెల్లు సొంత గ్రామమైన వీణవంకలోని హిమ్మత్ నగర్‌లో ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజారిటీ లభించడమే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లుకు సొంతూరి ప్రజలే షాకివ్వడం ఈటల ప్రభంజనాన్ని తెలియజేస్తోంది. ఎనిమిదో రౌండ్‌లో భాగంగా జరిగిన లెక్కింపు ప్రక్రియలో హిమ్మత్ నగర్ గ్రామంలో బీజేపీకి 548 రాగా, టీఆర్‌ఎస్‌కు 358 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామంతోపాటు కౌశిక్ రెడ్డి సొంతూరు ఓట్ల లెక్కింపు కూడా జరిగింది.
రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్‌ఎస్
మొత్తం 22 రౌండ్ల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
చదవండి: (ఈటల విజయం ఖాయం.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం)