ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా? | Hyderabad Become The Center Point Of Congress Central Politics | Sakshi
Sakshi News home page

ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా?

Published Sun, Feb 11 2024 4:11 PM | Last Updated on Sun, Feb 11 2024 4:47 PM

Hyderabad Become The Center Point Of Congress Central Politics - Sakshi

కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలకు హైదరాబాద్‌ మహానగరం కేంద్ర బిందువుగా మారిందా? ఇతర రాష్ట్రాల్లో సంక్షోభాలను చక్కదిద్దడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటోందా? తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లోని తన పార్టీ, మిత్ర పక్షాల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంప్‌లు నిర్వహించారు. తర్వాత ఏ రాష్ట్రం అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణకు ఏఐసీసీ ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది? 

కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారాయి. తమ పార్టీ జాతీయ స్థాయిలో టీ.కాంగ్రెస్‌కు బాధ్యత పెరిగింది. ఇటీవ‌ల కాలంలో 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల్లో జ‌రిగితే ఒక్క తెలంగాణ‌లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అందుకే కీల‌క‌ విష‌యాల్లో జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్‌ను విశ్వాసంలోకి తీసుకుంటోంద‌ని పార్టీ వ‌ర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భార‌త్ జోడో న్యాయ్ యాత్రలో కూడా టీపీసీసీ కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తోంది. రాహుల్ గాంధీ వాడుతున్న అత్యాధునిక వోల్వో బ‌స్సును కూడా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేత‌లు స‌మ‌కూర్చారు. 

జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజ‌నాల‌ను కాపాడ‌టంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ముందుంటోంది. ఇటీవ‌ల జార్ఖండ్‌లో ఇండియా కూట‌మి ప్రభుత్వానికి ఆపద వస్తే..అక్కడి ఎమ్మెల్యేల‌ను కాపాడ‌టంలో టీపీసీసీ అత్యంత చాక‌చక్యంగా వ్యహ‌రించింది. జార్ఖండ్ నుంచి వ‌చ్చిన 39 మంది ఎమ్మెల్యేల‌కు మూడు రోజుల పాటు శామిర్ పేట‌లోని ఓ రిసార్ట్‌లో వ‌స‌తి క‌ల్పించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పాటును అందించింది. ఇప్పుడు బీహార్ టాస్క్‌ను సైతం టీపీసీసీకే ఏఐసీసీ అప్పగించింది.

బీహార్‌లో ఇండియా కూట‌మి నుంచి జేడీయూనేత నితీష్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈనెల 12న అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజార‌కుండా కాపాడుకోవాల‌ని ఏఐసీసీ భావించింది. అందుకే వెంట‌నే వారిని కాపాడే టాస్క్‌ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు ఇబ్రహీంప‌ట్నం లోని ఓ రిసార్ట్‌లో వ‌స‌తి క‌ల్పించారు. 

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే. అందులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇందులో లో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. అందువల్ల ఎదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఈ రాష్ట్ర నాయకత్వానికి ఉండదు. ఇక మిగిలిన రెండు రాష్ట్రాలలో కర్ణాటకలో బీజేపీ చాలా బలమైన పార్టీ.. కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కర్ణాటక కంటే బీజేపీ బలం తక్కువగా ఉన్న తెలంగాణ బెటర్ అని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ క్రైసిస్ లో ఉన్నా దాన్ని తెలంగాణకు షిఫ్ట్ చేస్తుంది ఏఐసీసీ. దీనికి తోడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండడంతో హైదరాబాద్ ను క్యాంపు కేంద్రంగా ఏఐసీసీ భావిస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు.

మొత్తం మీద ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సొమ్మును ఏఐసీసీకి దోచి పెడుతున్నారనే విమర్శలు కూడా వినిస్తున్నాయి. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ ప్రాధాన్యత అయితే పెరిగిందనేది నిజం. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడమే అందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement