సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఉదంతంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఇలాంటి సీనియర్ నేత వెళ్లిపోతే పార్టీకి నష్టమని, రాజకీయంగా పలుచన అవుతామని ముఖ్య నాయకుల్లో అభిప్రాయం వ్యక్తమైంది. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వీహెచ్, సంపత్, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితర నేతలు జగ్గారెడ్డికి ఫోన్‌చేసి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
వీహెచ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ జగ్గారెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. బొల్లు కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని వీడొద్దని కోరారు. ముఖ్య నేతల విజ్ఞప్తితో జగ్గారెడ్డి కొంత మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నా.. తాను త్వరలో రాజీనామా చేస్తానంటూ సోనియా, రాహుల్‌లకు లేఖ రాయ డం గమనార్హం. మరోవైపు శనివారం రాత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా పార్టీలోనే కొనసాగాలని ఉత్తమ్ కోరారు.
అధిష్టానం ఆరా..
జగ్గారెడ్డి ఉదంతంపై ఏఐసీసీ కూడా ఆరా తీస్తోంది. రేవంత్‌రెడ్డితో విభేదాలున్నంత మాత్రాన రాజీనామా చేసేంతవరకు విషయం ఎందుకు వెళ్లిందన్న దానిపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌లు ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు సమాచారం. హైకమాండ్ జోక్యం చేసుకుని పరిష్కరిస్తే జగ్గారెడ్డి పార్టీలో కొనసాగతారని వారు పెద్దలకు వివరించినట్టు తెలిసింది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం ఈ వివాదం టీకప్పులో తుపాను వంటిదేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
మీడియాలో వద్దు: మాణిక్యం ఠాగూర్
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ మీడియా ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంగానీ, అభిప్రాయాలను చెప్పడంగానీ చేయవద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వేచ్ఛగా తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చని.. సమష్టి నిర్ణయాలనే మీడియాకు వెల్లడించాలని ట్విట్టర్‌లో సూచించారు.
బయటికెళ్తే పార్టీ పెడతా: జగ్గారెడ్డి
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళితే కొత్త రాజకీయ పార్టీ పెడతానని జగ్గారెడ్డి ప్రకటించారు. శనివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తనవల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సొంత పార్టీలోవారే తనపై బురద జల్లుతున్నా కనీసం ఖండించేవారు లేకపోవడం మనస్తాపం కలిగించిందన్నారు. తాను పార్టీని వీడితే కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని, తనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే విషయాన్ని వివరిస్తున్నానని చెప్పారు. అయి తే తన రాజీనామా నిర్ణయంపై ఢిల్లీ వెళ్లి వచ్చాక నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి శనివారం రాత్రి తెలిపారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులతోనేనా?
జగ్గారెడ్డి ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు అప్పులు పుట్టడం లేదంటూ స్వయంగా జగ్గారెడ్డి పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినా.. టీఆర్‌ఎస్‌లో చేరకుండా, తటస్థంగా ఉంటూ ప్రభుత్వంలో తన పనులు చేసుకునే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి రాజీనామా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగ్గారెడ్డి రాజీనా మా చేస్తే.. టీఆర్‌ఎస్‌లో చేరుతారా? తటస్థం గా కొనసాగుతారా? అన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment