సాక్షి, హైదరాబాద్: తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగిందని, చదువు కంటే రాజకీయలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అలాగే ప్రజలు తనకు ఇచ్చిన ఆశీర్వాదంతో రాజకీయాల్లో ఇక్కడివరకు వచ్చానని తెలిపారు. ప్రతిదీ తాను రాజకీయాలతో చూడనని, ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన స్వభావమని అన్నారు.
ఆయన శనివారం మీడియతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీలో అయినా లొసుగులు, అంతర్గత కలహాలు ఉంటాయని పేర్కొన్నారు. తాను కరెక్టుగా ఉన్నా కాబట్టే.. నిజమైన ప్రశ్నలు అడుగుతున్నానని అన్నారు. ఒక వ్యక్తి వ్యవస్థకు నష్టం చేస్తుంటే.. నష్టం చేస్తున్నారని చెబుతానని తెలిపారు.
ఎవరకీ భయపడేది, జంకేది లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతానని, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్ తీసుకున్నానని స్పష్టంచేశారు. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని, తాను పార్టీలో ఉండి, ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని, తన తీరువల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చని తెలిపారు.
ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే నిక్కచ్చిగా మాట్లాడినట్లు గుర్తుచేశారు. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగ్గారెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారనే అపవాదు తనకు ఇష్టం లేదని అన్నారు. తాను పోవాలనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలనని జగ్గారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment