
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ఎంపీలోని ప్రముఖ ఖజురహో స్థానం నుండి ఇండియా అలయన్స్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఖజురహో లోక్‌సభ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీకి కేటాయించింది. ఇప్పుడు సమాజ్‌వాదీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇండియా కూటమికి నష్టమని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీడి శర్మ ఖజురహో స్థానం నుండి గిలిచి ఎంపీ అయ్యారు. ఈ విధంగా చూస్తే ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది.
ఇండియా అలయన్స్ అభ్యర్థి మీరా దీప్ నారాయణ్ యాదవ్ సహా నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పన్నా సురేష్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ ఎస్పీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ పత్రాలలో సంతకాలు లేవన్నారు. అలాగే ఓటరు జాబితా కాపీ కూడా లేదన్నారు. పలు కారణాలతో ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొత్తం నలుగురి నామినేషన్ పత్రాలు రద్దయ్యాయని తెలిపారు.
ఖజురహో సీటుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ ఇద్దరు అభ్యర్థులను మార్చింది. మొదట మనోజ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. రెండు రోజుల తర్వాత మనోజ్ యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మీరా యాదవ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు మీరా యాదవ్ నామినేషన్ రద్దు కావడంతో కాంగ్రెస్, ఎస్పీల ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment