ముంబయి: ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిని ముందు ప్రకటించాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. కూటమి పేరుతోనే ఓట్లు అడగాలని శరద్ పవార్ పేర్కొన్నారు. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా మారగలదని చెప్పారు.
ఇండియా కూటమి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవార్.. "కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇండియా పేరుతో ఓట్లు అడగాలని నేను నమ్ముతున్నా. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయాన్ని అందించగలదు." అని శరద్ పవార్ అన్నారు.
మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి అయినప్పుడు జరిగిన రాజకీయ మార్పులను కూడా పవార్ ప్రస్తావించారు. ఆనాటి ఎన్నికలకు ముందు జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థి, లోక్‌సభ సీట్ల పంపిణీపై వచ్చిన కొన్ని నివేదికలను తోసిపుచ్చుతూ "కూటమి సమూహంలో ఎలాంటి అసంతృప్తి లేదు" అని స్పష్టం చేశారు.
ఇండియా కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేయడంపై పవార్ మాట్లాడుతూ.. "ఇండియా కూటమి అధ్యక్షుడిగా ఖర్గే ఉండాలని కొందరు నేతలు సూచించారు. చాలా మంది అందుకు అంగీకరించారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రతిపాదించారు. అయితే.. అందుకు నితీష్ కుమార్ తిరస్కరించారు. ప్రస్తుతానికి అది అవసరం లేదు". అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం!
Comments
Please login to add a commentAdd a comment