సాక్షి ప్రతినిధి, చెన్నై/పుదుచ్చేరి: ‘విభజించు, అబద్ధమాడు, పాలించు’ అనేదే కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశంలో కాంగ్రెస్ సంస్కృతి అయిన ఫ్యూడల్, వారసత్వ రాజకీయాలు ముగిసిపోయాయని అన్నారు. దేశమంతటా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీలో బంగారు, వెండి, రజత పతక విజేతలున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో గురువారం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన నుంచి పుదుచ్చేరి స్వేచ్ఛ పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ‘హైకమాండ్’ ప్రభుత్వానికి నేతృత్వం వహించారని, ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రయోజనాల కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నారాయణస్వామి కాంగ్రెస్ పెద్దల చెప్పులు మోయడంలో సిద్ధహస్తుడని మండిపడ్డారు. పుదుచ్చేరిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఎన్డీయే కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిని వ్యాపార, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు.
పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు
విభజించు, పాలించు అనేది వలస పాలకుల సిద్ధాంతమైతే.. విభజించు, అబద్ధాలు చెప్పు, పాలించు అనేది కాంగ్రెస్ విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రాంతాలకు మధ్య, వర్గాలకు మధ్య తగువు పెడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని రాహుల్ గాంధీ మంగళవారం కేరళలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. 2019లో మత్స్య శాఖను ఏర్పాటు చేశామని, బడ్జెట్‌లో ఆ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు. పుదుచ్చేరి ప్రజలు 2016లో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, వారి ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు వీస్తున్నాయని చెప్పారు.
అన్నదాత బాగుంటే..
కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ తమిళుల కలలను సాకారం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆయన గురువారం పుదుచ్చేరితోపాటు తమిళనాడులోని కోయంబత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను
ప్రారంభించారు.
‘మోదీ గో బ్యాక్’
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత, నీట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్‌ను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోయంబత్తూరులో నల్లజెండాలతో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినదించారు. ఇద్దరు యువతులు సహా 77 మందిని విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్‌పేటలో నల్లబెలూన్లు ఎగురవేసిన తమిళగ వాళ్వురిమై కట్చి కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ అబద్ధాలకోరు పార్టీ
Published Fri, Feb 26 2021 4:40 AM | Last Updated on Fri, Feb 26 2021 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment