సాక్షి, హైదరాబాద్: ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిందని, మోదీ నేతృత్వంలో అధికారం లోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిం దని దుయ్యబట్టారు.
పెట్రో ధరల పెంపులో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ సహా మన పొరుగు దేశాలతోపాటు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ పెట్రో ఉత్ప త్తుల ధరలు భారత్‌లో కంటే తక్కువగా ఉన్నాయ న్నారు. ‘కరోనా సంక్షోభం లోనూ పెట్రో ఉత్పత్తు లపై ఎక్సైజ్ సుంకం పెంచారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగకున్నా దేశంలో మాత్రం ధరలు పెరుగు తున్నాయి.
అసమర్థ ఆర్థిక విధానాలతో సంపదను సృష్టించే తెలివి లేక పన్నులు పెంచడమే సుపరి పాలన అనే భావదారిద్య్రంలో కేంద్రం ఉంది. దేశంలోని 26 కోట్ల కుటుంబాలపై రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను వడ్డించి సగటున ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష మోదీ ప్రభుత్వం లూటీ చేసింది. పన్నుల రూపంలో బహిరంగ దోపిడీ చేస్తున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలే పన్నులు తగ్గించాలనే వితండ వాదాన్ని తెరమీదకు తెస్తోంది’ అని అన్నారు.
రాష్ట్రాలకు పంచుతున్నది అరకొరే..: పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలో 41% తిరిగి రాష్ట్రాలకే చెల్లిస్తున్నా మంటూ కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ సుంకంలో 50 పైసలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారన్నారు. ‘రాష్ట్రాలను బలహీన పరిచే కుట్రలను అమలు చేస్తూ మోదీ కేంద్ర ప్రభుత్వ ఖజానా నిండేలా చూసుకుంటు న్నారు.
సెస్సుల రూపంలో రూ.30 వసూలు చేస్తూ రాష్ట్రాలకు మొండిచేయి చూపుతున్నారు. 2015 నుంచి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా పన్నులు పెంచలేదు. బీజేపీ ప్రభుత్వం మాత్రం 15 రోజుల్లో 14 సార్లు ధరలు పెంచింది. పెట్రో ధరల పెంపుపై అబద్ధాలు చెప్పే నేర్పు ఉన్న మోదీ ప్రభుత్వం అనేక దేశాల నుంచి పెట్రో ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నా.. రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతోంది’ అని కేటీఆర్ చెప్పారు.
గ్యాస్, పప్పు, ఉప్పు తదితర నిత్యావసరాలతో పాటు ఔషధాల ధరలు కూడా భారీగా పెరిగి.. సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారిందన్నారు. మోదీ చెప్పినట్లుగా పకోడీలు కూడా అమ్ముకుని బతికే పరిస్థితి లేదని ఎద్దేవాచేశారు. పెట్రో ధరల పెంపును అడ్డుకోవ డంలో విఫలమైన మోదీ దేశ ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టిం చుకున్న రోజు.. ధర్మ సంకటాన్ని వీడి కేంద్రంపై తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment