సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పురపాలక ఎన్నికల్లో రాష్ట్రమంతటా తుడిచిపెట్టుకుపోయినా... కొద్దోగొప్పో సీట్లు గెలిచి టీడీపీ పరువునిలబెట్టిన విశాఖ కార్పొరేటర్లను సైతం ఆ పార్టీ అధిష్టానం పొమ్మనలేక పొగబెడుతోందా...? గెలిచిన మెజారిటీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని కనీసంగా పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతోందా... ? అవుననే అంటున్నారు మెజార్టీ టీడీపీ కార్పొరేటర్లు ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పీలా శ్రీనివాసరావును నియమించడంపై భగ్గుమంటున్నారు.
గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన సీనియర్లను పరిగణనలోకి తీసుకోకుండా తొలిసారి గెలిచిన పీలాను ఎలా ఎంపిక చేస్తారంటూ ఆ పార్టీ సభ్యులు మండిపడుతున్నారు. విపక్షనేతగా ఎక్కడైనా సీనియర్ సభ్యులకే అవకాశం ఇస్తారని, కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం అనుభవం లేని పీలాకి ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది
వేలం పెట్టి మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా...
ఎన్నికల ప్రచారంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడే జీవీఎంసీ టీడీపీ మేయర్ అభ్యరి్థగా పీలా శ్రీనివాసరావును ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ తతంగానికి ముందు చాలా హైడ్రామా నడిచినట్టు తెలుస్తోంది. టీడీపీ మేయర్ అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎంబీసీ మాజీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.. గండి బాబ్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా.. టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. కాకి గోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.
మేయర్ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే రూ.15 కోట్లు ఖర్చు పెడతానని బాబ్జీ, ఐదారు కోట్లు ఖర్చు పెట్టగలనని గోవిందరెడ్డి ముందుకొచ్చినా.. ఆ ఇద్దరి నేతల వ్యతిరేకతతో అధిష్టానం వీరిద్దరినీ పక్కనపెట్టి మధ్యేమార్గంగా పీలా శ్రీనివాసరావును తెరపైకి తీసుకొచ్చింది. దీంతో గండి బాబ్జీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా, గోవిందరెడ్డి మాత్రం కార్పొరేటర్‌గా పోటీకి దిగారు.
పీలా శ్రీనివాసరావు వీరిద్దరి కంటే ఎక్కువ ఖర్చు పెడతానని వేలంపాటలో చెప్పుకొచ్చి... తీరా తన వార్డులో డబ్బు కుమ్మరించడం మినహా పెద్దగా ఎవ్వరికీ ఇవ్వలేదని అంటారు. సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు పీలా శ్రీనివాసరావు ఎవరికీ దొరక్కుండా సెల్ స్విచాఫ్ చేసేశారని అంటారు. ఇదే విషయమై టీడీపీ అధిష్టానానికి పోలింగ్ ముగిసిన వెంటనే టీడీపీలో ఓ వర్గం ఫిర్యాదు కూడా చేసింది. అలాంటి పీలా శ్రీనివాసరావుకే మళ్లీ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ పదవి ఎలా కట్టబెడతారంటూ బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మెజార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
క్యాష్–క్యాస్ట్ చూస్తే ఎలా?
మెజారిటీ వార్డు కార్పొరేటర్ల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇష్టానుసారం పీలా శ్రీనివాసరావును ఫ్లోల్ లీడర్‌గా నియమించడం... పార్టీకి చాలా నష్టదాయకమనే అభిప్రాయాన్ని నేతలు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ దశలోనే టీడీపీ సీనియర్ నేత ఒకరు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టినందుకే పీలాకి ఇచ్చారని చెప్పగా.. అలాగైతే రెండేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎంపీ భరత్.. పెద్ద మొత్తంలో రూ.కోట్లు ఖర్చుపెట్టారని. మరి ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా పల్లా శ్రీనివాసరావుకు ఎలా ఇచ్చారని సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. డబ్బులు, వర్గాలతో పనిలేకుండా అధికారపక్షంలో సామాన్యులకి పెద్దపీట వేస్తుంటే... ఇంకా ఈ పారీ్టలో క్యాష్–క్యాస్ట్ చూస్తే ఎలాగని నిలదీసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆదిలోనే మొదలైన టీడీపీ కార్పొరేటర్ల వర్గపోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.
ఆ ఐదుగురూ అభ్యంతరం..
పీలా శ్రీనివాసరావును ఫ్లోర్ లీడర్‌గా నియమించడంపై 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 97వ వార్డు కార్పొరేటర్ శేనాపతి వసంత బహిరంగంగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
చదవండి:
ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే..
మేయరమ్మా... ఇదేంటమ్మా!
Comments
Please login to add a commentAdd a comment