![Jada Sravan Shocking Comments On Chandrababu And Pawan Kalyan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/23/jadasaravan1.jpg.webp?itok=RBqZLSuD)
సాక్షి, విజయవాడ: గత నాలుగు నెలల నుంచి ఏపీలో అత్యంత భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయంటూ కూటమి ప్రభుత్వంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమికి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని ధ్వజమెత్తారు.
‘‘కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కూడా అమ్మాయిలను టార్గెట్ చేయడంలో బిజీగా ఉన్నట్లున్నారు. మొన్న తిరువూరు, సత్యవేడు ఘటనలు చూస్తే ఇదే నిజమని అనిపిస్తోంది. పరిపాలన ఎలా చేయాలో కాకుండా ఆడవాళ్లకు ఎలా మెసేజ్‌లు పెట్టాలి, ఆడవాళ్లను ఎలా రూములకు పిలిపించుకోవాలని అనే అంశాల్లో బాగా బిజీగా ఉన్నట్లున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడితే.. దగ్గరుండి రాజీ చేయించారు. మీ రాజ్యంలో అత్యాచారం చేస్తే అడిగేవాడే లేదు.. మర్డర్ చేస్తే మాట్లాడేవాడు లేడు. చంద్రన్నరాజ్యం అని చెప్పుకుంటూ సీఎం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు’’ అంటూ శ్రవణ్ నిప్పులు చెరిగారు.
‘‘జనసేన కార్యకర్తలు, నాయకులు దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రండి. ఈ రాష్ట్రంలో మహిళలపై మీ నాయకుడు అప్పుడేం మాట్లాడాడో.. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం గడ్డిపీకుతున్నాడో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చిద్దాం రండి. అధికారంలో లేనప్పుడు.. ఉప ముఖ్యమంత్రిగా అయినప్పుడు మీ సచ్ఛీలత ఏంటో ప్రజల ముందు నిరూపిద్దాం. కుప్పం నియోకవర్గంలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఉమెన్ మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అన్ని కేసులు నమోదైతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా?. సీఎం సొంత నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ లేదు.. ఉద్యోగాలు లేవు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా అని సందేహం కలుగుతోంది’’ అంటూ శ్రవణ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment