
కాంగ్రెస్ నా గొంతు నొక్కలేదు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి
నా సస్పెన్షన్‌కు చూపిన కారణాలేవీ సరికాదు
స్పీకర్‌ను మీరు అనే సంబోధించా.. ఏకవచనం లేదు... సభాపతి
స్థానానికి కుల మతాలు ఉండవు
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభ్యుడిగా నా హక్కులు కాపాడుకోలేని నేను ప్రజల హక్కులను ఎలా కాపాడగలను? ఎలాంటి సభా సాంప్రదాయాలను ఉల్లంఘించకున్నా నన్నుఅసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం. నా సస్పెన్షన్‌కు చూపిన కారణాలేవీ సరికాదు. కాంగ్రెస్ పార్టీకి నా గొంతు నొక్కడం సాధ్యం కాదు. పంటలు ఎండి బాధ పడుతున్న రైతు గురించి, ప్రభుత్వం చేతిలో మోసానికి గురవుతున్న ప్రజల గురించి మరింత బలంగా నా గళం వినిపిస్తా.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తా..’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం భేటీలో సీఎం సమక్షంలో ముందే నిర్ణయం తీసుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేయడంపై జగదీశ్‌రెడ్డి శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
పథకం ప్రకారమే గొడవకు దిగారు
‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై కాంగ్రెస్ నుంచి ఇద్దరు సభ్యులు సుమారు గంటన్నర పాటు మాట్లాడినా మేం ఎక్కడా అడ్డు చెప్పలేదు. కానీ నేను మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పథకం ప్రకారమే గొడవకు దిగారు. స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా నేను ఒక్క అక్షరం కూడా ఉపయోగించలేదు. 50 మంది సభ్యులు అంతరాయం కలిగిస్తున్నా స్పీకర్ నా రక్షణకు రాలేదు. సభను నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని మాత్రమే చెప్పా.
సభ్యులందరికీ సమాన హక్కులుంటాయనే విషయాన్ని గుర్తు చేశా. నేను స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించానని, దళితులను అవమాన పరిచానని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో దళిత కోణం ఎక్కడుందో చెప్పాలి. ఏకవచనంతో సంబోధించలేదు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. సభాపతి స్థానానికి కుల మతాలు ఉండవు. ప్రజలు ప్రత్యక్షంగా నేను మాట్లాడిన తీరును వీక్షించారు. ఈ విషయంలో స్పీకర్ నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. సభను ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో నడిపిస్తోంది..’అని జగదీశ్‌రెడ్డి అన్నారు.
సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కారు
‘నా సస్పెన్షన్ విషయంలో అన్ని సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. అన్ని పార్టీల సభాపక్ష నేతల సమక్షంలో నా వ్యాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కనీసం వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. నేను మాట్లాడిన అతికొద్ది సమయంలో ఎక్కడా అన్‌పార్లమెంటరీ పదాలు వాడలేదు..’అని మాజీమంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment