సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌కు ఒకదాని మీద మరో సమస్యను తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జరిపిన సమీక్షకు కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడం మరో జగడానికి తెరతీసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అనుబంధ సంఘాల ఇన్‌చార్జిగా, 4 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జిగా ఉన్న తనకు శనివారం ఢిల్లీలో జరిగిన భేటీ గురించి కనీస సమాచారం ఇవ్వలేదంటూ ఆయన శనివారం ఏఐసీసీకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
ఈ భేటీకి తనను ఆహ్వానించకపోవడం బాధ కలిగించిందని, అందుకే లేఖ రాస్తున్నానని తెలిపారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ కేసీ.వేణుగోపాల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మాణిక్యం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌కు పంపిన ఈ లేఖలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థిని పోటీకి ఎందుకు దింపలేదని, చివరి నిమిషంలో బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేతలు 3 నెలల ముందు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థిని నిలబెట్టి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలు ఆయనకు సాయం ఎందుకు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి, ఈటల రాజేందర్‌కు ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలన్నారు. దీనికి బాధ్యులెవరని ఆ లేఖలో ఆయన ప్రశ్నించారు. తాను ఇదే విషయాన్ని ఫలితం వచ్చిన రోజు మీడియాతో మాట్లాడానని, ఆ తర్వాతి రోజు జరిగిన పీఏసీ సమావేశంలో కూడా లేవనెత్తానని లేఖలో వెల్లడించారు.
మీడియాతో ఎందుకు మాట్లాడతారని కొందరు నేతల అభిమాన సంఘాలు సోషల్‌మీడియాలో తనను ఆ రోజు ప్రశ్నించాయని, మరి ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశం గురించి మీడియాకు లీకులు ఎలా వచ్చాయని, అలా రావడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ఆవేదనతోనే కొన్ని విషయాలను పంచుకుంటూ ఈ లేఖను రాస్తున్నట్లు జగ్గారెడ్డి ఏఐసీసీకి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment