రాజకీయ నేతగా అవతారం ఎత్తిన సినీ హీరో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉనికి చాటేందుకు ఉత్సాహ పడుతున్నారు. ఈ నవంబరులో జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా 32 సీట్లు తమకు కావాలని బీజేపీతో బేర సారాలు మొదలు పెట్టారు. అవి కూడా ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న స్థానాలు కావడం విశేషం. ఏపీలో రాజకీయాలు చేస్తున్న జనసేనకు వాస్తవానికి తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కేసును ఎదుర్కొంటున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వీరంగం కట్టిన పవన్ కళ్యాణ్ 2024 ఏపీ శాసన సభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుని తమ భాగస్వామ్యం గురించి ప్రకటన కూడా చేశారు.
తెలంగాణ శాసన సభ ఎన్నికలు వేదికగా..
జనసేన పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అయిదు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎన్నికల అరంగేట్రం చేసింది. కానీ, ఒక్క చోటా ఆ పార్టీ గెలవలేకపోయింది. సినిమా హీరోగా ఉన్న అభిమానమే పునాదిగా జనసేన ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నా ఇప్పటి దాకా ఆ దిశలో పడిన అడుగులు తక్కువే. కానీ, ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తాము ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరుపుతున్న బీజేపీ నాయకత్వం వద్ద ఈ ప్రతిపాదన కూడా పెట్టింది. ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరం పరిధిలోని పటాన్ చెరు, కూకట్ పల్లి, సనత్ నగర్, కుద్బుల్లా పూర్, శేరిలింగం పల్లి, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్.బి.నగర్ నియోజకవర్గాలలో పోటీ చేయాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఈ ఓటర్లంతా టీడీపీ వెనక నిలబడినట్లు నాటి ఎన్నికల ఫలితాలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత నియోజకవర్గాలే ఏడు కావడం ప్రస్తావనార్హం. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉండే.. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా పోటీ కోసం జనసేన ఉవ్విళ్ళూరుతోంది. ఒక్క నల్గొండ జిల్లాలోనే 4 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.
తెలంగాణలో ఈసారి పోటీ ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటికే 2014, 2018 లో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో జనసేప పోటీ చేయలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 5 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఫలితం సాధించలేక పోయింది. ఇక్కడ సత్ఫలితాలు సాధించేంతగా జన బలం లేదని తెలిసినా ఈ సారి ఏకంగా 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన ఎందుకు నిర్ణయించుకుంది..? 2019 లోక్ సభ ఎన్నికల తర్వాతి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో బలపడేలా కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించిందా..? జనంలోకి చొచ్చుకుపోయిందా ..? అన్న ప్రశ్నలకు ఒక్క దానికి కూడా ఆ పార్టీ నేతల దగ్గర సరైన సమాధానం దొరకదు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ స్కామ్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముద్దాయిగా కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవడమే గగన కుసుమంగా మారిన కారణంగా తెలంగాణలో టీడీపీ చేతులు ఎత్తేసింది. చివరి నిమిషం దాకా తేల్చకుండా తీరా మూడు రోజుల కిందట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు చావుకబురు చల్లగా చెప్పిన చంద్రబాబు తీరుతో టీటీడీపీ నాయకులు, శ్రేణులు షాక్ గురయ్యాయి. దీంతో రెండు రోజుల కిందట టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయదన్న విషయం జనసేన అధినేతకు ముందే తెలుసా..? ఆ కారణంగానే ఆయన బీజేపీలో పొత్తుల రాయబారం నడిపారా..? తెలంగాణలో టీడీపీకి ఉన్నట్లు భావిస్తున్న అంతో ఇంతో ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ఈ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతున్నారా అన్న అంశాలు ఇపుడు చర్చకు వస్తున్నాయి.
దిగజారిన టీడీపీ స్థానంలో.. జనసేను నిలబెట్టే ప్రయత్నాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. 2014 లో 15 సీటులు గెలుచుకున్నా టీటీడీఎల్పీని నాటి టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. చివరకు 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కకు తప్పుకుని ముందే అస్త్ర సన్యాసం చేసింది. ఇపుడు టీటీడీపీ స్థానంలో జనసేనను నిలబెట్టే ప్రయత్నాలు తెలంగాణలో జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మంచి ఊపు మీదున్న బీజేపీ ఆ తర్వాత చతికిల పడింది. పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. ఏ పార్టీలతో పొత్తు లేదు.. ఈ సమయంలో జనసేన తాము ఉన్నామంటూ పొత్తుల కోసం వస్తోంది. పొత్తుల అంశం ఇంకా ఖరారు కాకున్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం తాము పోటీ చేసిన స్థానాల నుంచి వైదొలిగిన జనసేన ఈ సారి 32 సీట్లలో తాము పోటీ చేస్తామని, తమకు మద్దుత ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్.డి.ఎ)లో బీజేపీతో కలిసి జనసేన భాగస్వామ్య పక్షంగా పనిచేస్తోంది. ఈ అంశాన్ని ముందు పెట్టి తెలంగాణలో బీజేపీ అండదండలతో పాగా వేసే ప్రతయ్నాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-మిత్ర. ఎన్
Comments
Please login to add a commentAdd a comment