కారుపైకి ఎక్కి ప్రయాణిస్తున్న పవన్
సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో అధికారులు రోడ్డు పక్కన ఉండే ఆక్రమణలు తొలగించడంపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్.. పార్టీ నాయకులను, కార్యకర్తలను వెంట బెట్టుకొని వెళ్లి హడావుడి చేశారు. ఆక్రమణలు తొలగింపులో భాగంగా అధికారులు కొన్ని ఇళ్ల ప్రహరీ గోడలను మాత్రమే కూల్చివేయగా, గ్రామంలోని తమ పార్టీ అభిమానుల ఇళ్లను ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చి వేసిందంటూ హంగామా చేశారు.
అధికారులు శుక్రవారం రోడ్లకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలు తొలగించిన ఇప్పటం గ్రామంలో శనివారం పవన్‌కళ్యాణ్ పర్యటించారు. ఉదయం మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయలుదేరిన ఆయన.. కాసేపటి తర్వాత తాను ప్రయాణించే కారు పైకెక్కి కూర్చొని ఇప్పటం గ్రామం వైపు వెళ్లారు. మధ్యలో నార్త్‌జోన్ డీఎస్పీ రాంబాబు శాంతిభద్రతల సమస్య గురించి పవన్‌కు నచ్చచెబుతుండగా వినిపించుకోకుండా.. ‘ఊరుకోండి సార్ మీరు చెబుతారు.. రేప్ చేసిన వారిని రక్షిస్తారు.. కూలగొట్టిన వారికి అండగా ఉంటారు’.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
గ్రామంలోకి చేరుకున్నాక, తొలగించిన ఆక్రమణల శిథిలాలను పరిశీలిస్తూ.. కొద్దిమంది స్థానికులతో తీవ్రంగా స్పందించి.. జనసేన అభిమానుల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేసిందంటూ ఆరోపించారు. ఆ సమయంలో ఆ పార్టీ నేత ఒకరు.. ‘నేను ఈ రోజు మీతో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడతానని చాలెంజ్ చేశాను’ అంటూ చెప్పగా.. ‘మాట్లాడు’ అంటూ పవన్ ఆవేశంగా ఆయనను మీడియా వైపు చూపించారు.
ఇదేమైనా రాజమండ్రా..
రోడ్డు వెడల్పు చేయడానికి ఇదేమన్నా కాకినాడా.. లేదంటే రాజమండ్రినా అంటూ పవన్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు 15 అడుగుల పరిధిలోనే ఉందని.. అక్కడ ఇలాంటివి వర్తించవా అని అన్నారు. మార్చిలో జరిగిన తమ పార్టీ ఆవిర్భావ సభకు ఈ గ్రామస్తులు స్థలం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి మొన్న ఏప్రిల్‌లో ఆక్రమణల తొలగింపు పేరిట నోటీసులిచ్చారని చెప్పారు.
‘వైసీపీ గూండాలకు చెబుతున్నా.. మీరు ఇలాగే చేస్తా ఉండండి.. ఇడుపులపాయలో మీ మీద హైవే వేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పడదొబ్బాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.
రూ.వెయ్యి కోట్లిచ్చి రెక్కీ నిర్వహించుకోండి..
హైదరాబాద్‌లో తన ఇంటి దగ్గర కొందరు తాగుబోతులు గొడవ చేయడాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. ‘మీరు నన్ను ఏదో చేయడానికి రెక్కీలు, సుపారీలు, సున్నాలు, కన్నాలు ఏవేవో ప్లాన్ చేస్తున్నారు. రెక్కీ నిర్వహించుకోవడానికి రూ.250 కోట్లు కాకపోతే రూ.వెయ్యి కోట్లు ఇచ్చుకోండి’ అని వ్యాఖ్యానించారు.
ఇలాంటి పిచ్చి పనులకు పవన్‌కళ్యాణ్ గానీ, జనసేనగానీ భయపడదన్నారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తేలేదు, గుర్తుపెట్టుకోండన్నారు. మరోవైపు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని.. ఎవరి ప్రాణాలు పోయినా అన్నింటికీ సజ్జలదే బాధ్యత అని హెచ్చరించారు.
వారి భాషలోనే మాట్లాడండి
ఇప్పటం గ్రామ పర్యటన అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మరోసారి పవన్ మాట్లాడుతూ.. ‘జన సైనికులకు చెబుతున్నా, ఇక నుంచి వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య భాషలో మాట్లాడితే అలాగే మాట్లాడండి. కాదు కూడదు అంటే వారి భాషలోనే మీరూ మాట్లాడండి. కేసులు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తామంటే వాటిని ఎదుర్కోవడానికి మీతో పాటు నేను సిద్ధంగానే ఉన్నాను.
ఎంతకాలం వీరి అరాచకాలకు భయపడితే అంతకాలం వీరి రాక్షసత్వానికి అంతుండదు. ప్రతి లెక్కకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది’ అని అన్నారు. కాగా, పరామర్శ కోసం గ్రామానికి విచ్చేసిన పవన్‌కళ్యాణ్‌పై పలుచోట్ల పార్టీ శ్రేణులు పూలు చల్లడంపై గ్రామంలో విమర్శలు వెల్లువెత్తాయి.
అలాగే, ఎంపిక చేసిన కొన్ని ఇళ్ల వారిని పవన్ పరామర్శించినా, వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఆయన పర్యటనపై గ్రామస్తులు పెదవి విరిచారు. గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వకుండా ఈ హంగామా ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment