జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహంతో ఊగిపోయారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సభలో పవన్ తన ఆక్రోశం వెల్లగక్కారు. తన ప్రసంగంలో జనసైనికులకు షాకిస్తూ ఎవరూ ఇగోలకు పోవద్దని తనకు తగిన బలం లేదని కొత్త కథ అల్లేశాడు. పార్టీలో జెండాలు మోసే ప్రతీ ఒక్కరికీ టికెట్ ఇవ్వలేనని కుండబద్దలు కొట్టేశాడు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తున్న జనసైనికులపై ఫైరయ్యారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతున్నవేళ ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనేది ప్రజలకు వివరించాలి. ప్రస్తుత ప్రభుత్వ పనితీరులో ఏవైనా లోపాలు ఉంటే చెప్పే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా పవన్ కల్యాణ్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ సినిమా రేంజ్‌లో ఊగిపోయారు. సీఎం జగన్‌పై ఆక్రోశం వెల్లగక్కారు. సరే.. ఎందుకు వైఎస్సార్‌సీపీ, ముఖ్యమంత్రిపై కోపం అంటే సమాధానం చెప్పరు. పెద్దగా అరుస్తూ.. కేకలు వేస్తూ ఏదో ఏదో మాట్లాడేశాడు.
ఇదే సమయంలో జనసైనికులకు షాకిస్తూ పవన్ ప్రసంగం సాగడం కొసమెరుపు. సభలో పవన్.. జనసేనకు బలం లేదనే ఆవేదన వుంది. జనసమీకరణ చేయలేను. వాళ్లకు తిండి పెట్టి తన వెంట తిప్పుకోలేను. నియోజకవర్గాల స్థాయిలో తమకు కేడర్ లేదు. కేడర్‌ను పోషించే నాయకులు లేరు. పోల్ మేనేజ్‌మెంట్ రాదు. అనే ఆవేదన వుంది. ఈ ఆవేదన సాకుగా తెలుగుదేశం పార్టీకి తోకపార్టీగా మారిపోయామని చెప్పలేక, ఏవో సాకులు చెప్పేశాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తారా? అనే ఆగ్రహం వుంది. విదేశాల్లో కూర్చుని సోషల్ మీడియాలో తనను ప్రశ్నించే జనసైనికులు తన వారు కాదు.. తను ఎలా చేస్తే అలా తల ఊపుతూ తన వెంట నడిచే వారే తనవాళ్లు అని క్లారిటీ ఇచ్చారు.
అయితే, పవన్ స్పీచ్ మొత్తం టీడీపీ, చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా మాత్రమే కొనసాగింది. జనసేన గురించి మాత్రం మొత్తం నెగిటివ్‌గానే ప్రసంగం సాగింది. పవన్ స్పీచ్‌లో కొత్త పాయింట్ ఒక్కటి చెప్పమని అడిగితే ఏ జనసైనికుడైనా తెల్లమొహం వేయాల్సిందే. ప్రసంగం ఆద్యంతం సీఎం జగన్ మీద ద్వేషం.. ఆక్రోశం.. అది తప్ప మరేమీలేదు. ఇక, పవన్ ప్రసంగంతో తనకు భలే దొరికాడు అని చంద్రబాబు ఆనందపడ్డాడు. అసలు పవన్‌కు ఉన్న అజెండా ఏమిటో చెప్పకపోవడం మరో విశేషం.
ఇక్కడ అసలు విషయానికి వస్తే.. బీజేపీతో జనసేన పొత్తు అంటాడు కానీ.. నిన్నటి సభలో బీజేపీ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. బీజేపీతో పొత్తు గురించి ప్రస్తావించలేదు. ఎంతసేపు టీడీపీ భజనే చేశాడు. ఇక, జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినా పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోయావ్ అని ఎవరైనా జనసైనికుడు ప్రశ్నిస్తే పవన్ ఏం సమాధానం చెబుతాడు. ఇదే పదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో పార్టీలు తమ కేడర్‌ను పెంచుకుని అధికారంలోకి వచ్చాయి కదా. కనీసం ఎన్నికల్లో గట్టి పోటీ అయినా ఇచ్చాయి కదా. మరి పవన్ ఎందుకు చేయలేకపోయాడు?. ఇప్పటికైనా జనసైనికులు, ప్రజలు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే.. పవన్ ఒక పార్ట్ టైమ్ పొలిటిషియన్ మాత్రమే అని!. ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతాడు అని.
Comments
Please login to add a commentAdd a comment