లక్నో: రాష్ట్రీయా లోక్ దళ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేరుతారని ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాలు ఆర్‌ఎల్డీ పార్టీ బీజేపీలో చేరిందనడానికి బలం చేకూర్చాయి కూడా. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీనరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్‌కు భారత రత్న ప్రకటించింది. అయితే చరణ్ సింగ్.. మనవడే ప్రస్తుత ఆర్‌ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీ. తన తాతకు భారత రత్న ప్రకటించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో చేరికకు సంబంధించిన ప్రచారాన్ని ధ్రువీకరించారు.
గత ప్రభుత్వాలు చాలా ఏళ్ల నుంచి చేయని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ఈ రోజు మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారత రత్న ప్రకటించారని ఆనందం వ్యక్తంచేశారు. వెలుగులోకి రాని వ్యక్తులకు ప్రధాన స్రవంతిలోకి తీసువచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరుతారన్న ప్రశ్నకు... ‘మీకేమైనా అనుమానం ఉందా? నేను ఈ రోజు ఎలా తిరస్కరించగలను’ అని అన్నారు. దీంతో జయంత్ చౌదరీ ఎన్డీయే కూటమి చేరిపోతారని సంకేతాలు అందించినట్లు అయింది.
సామాజ్‌వాదీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఆర్‌ఎల్డీ.. బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని తెగప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. పార్టీలను ఎలా విడగొట్టాలో బీజేపీకి బాగా తెలుసని, ప్రత్యర్థులపై ఎలా దాడి చేయాలో కూడా బీజేపీ తెలుసని మండిపడ్డారు. పార్టీల్లో, నాయకల్లో చీలికలు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీను ఎలా వాడుకోవాలో బీజేపీ వాళ్లకు తెలుసని ఆరోపంచారు. ఎలా మోసం చేయాలో మొన్నటి చంఢీఘర్ మేయర్ ఎన్నికల పోలింగ్‌తో అర్థం అవుతుందని అన్నారు. ఎవరిని ఎలా కొనుగోలు చేయాలో కూడా బాగా తెలుసని.. విధానాల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ధ్వజమెత్తారు.
గత 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ కూటమిలో భాగంగా ఆర్‌ఎల్డీ బరిలోకి దిగినప్పటికీ పోటీ చేసిన మూడు స్థానాల్లో (మథుర, బాగ్‌పట్, ముజఫర్ నగర్) ఓటమి పాలుకావటం గమనార్హం. జాట్ వర్గంలో ఆర్‌ఎల్డీకి మంచిపట్టు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment