జగ్గంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుపోటములు సహజమని, వాటికి సిద్ధపడి ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపం కలిగించిందని తెలిపారు. పార్టీకి సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా చోట్ల గెలిచే అవకాశాలున్న తరుణంలో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోటీ నుంచి తప్పుకోం
రావికమతం : పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన తాము ఎన్నికల బరిలోంచి తప్పుకోమని విశాఖ జిల్లా రావికమతం మండల టీడీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మేడివాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉంటారని ధిక్కార స్వరం వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment