సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. అంచనాలు పెంచి కట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. పవర్ జనరేట్ ప్రాజెక్టులు, సబ్ స్టేషన్‌లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం వల్లే అంచనా పెరిగిందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద, 19, 20, 21 పిల్లర్లు కుంగడం దురదృష్టకరమని.. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ కూడా కోరుకుంటోందని తెలిపారు.
జ్యూడిషియల్ ఎంక్వైరీ కచ్చితంగా చేయాలన్నారు కడియం. అయితే విచారణ జరగకముందే మంత్రులు తీర్పులు చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా విషయాల్లో అవగాహన ఉందని భావించానని..కానీ ఆయనే పూర్తిగా తెలుసుకోకుండా తీర్పునిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్‌తో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి అడుగడుగునా విషం నింపుకుంది కాబట్టే హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయా హోదా తీసుకురావాలని, ఇందుకు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు.
కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లిన మంత్రులు.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేయటానికి కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శించారు. శ్వేత పత్రాలు అంటూ కొంత కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి అంటూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడిహాట్టి దగ్గర కట్టింది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజెక్ట్ మాత్రమేనని తెలిపారు.
చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్
Comments
Please login to add a commentAdd a comment