
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్యే రాజయ్య నా కుటుంబం గురించి, నా తల్లి, నా బిడ్డ గురించి సభ్యత, సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడారు.. నేను నోరు విప్పితే ఆయన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తల్లి అనేది సత్యం.. తండ్రి అనేది అపోహ అంటూ నా తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉన్న ప్రతి తల్లిని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, ఇందుకు రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ’’అవును నాతల్లి బీసీ, తండ్రి ఎస్సీ, సుప్రీంకోర్టు తీర్పు, చట్టం ప్రకారం నేను ఎస్సీ, నా బిడ్డ ఎస్సీ. నాబిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టే పిల్లలకు తండ్రి మతం, కులం వర్తిస్తుంది’ అని చెప్పారు.
1994కు ముందు ఎన్‌కౌంటర్లు జరగలేదా...
తనను ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో 1994కు ముందు ఎన్‌కౌంటర్లు జరగలేదా అని కడియం ప్రశ్నించారు. అధిక ఎన్‌కౌంటర్లు 2004–14 మధ్యలో జరిగాయని, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నక్సలైట్లను చర్చలకు పిలిచిన విషయాన్ని గుర్తుకు చేశారు. 2004 నుంచి 2012 వరకు రాజయ్య కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఆ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్లకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.
వేల కోట్ల ఆస్తులు నిరూపిస్తే దళితులకు రాసిస్తా..
రాజయ్య ఆరోపిస్తున్న విధంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని నియోజకవర్గ దళితులకు రాసిస్తా అని కడియం అన్నారు. నియోజకవర్గంలో పనులు ఇస్తానని, పదవులు ఇస్తానని ఏ ఒక్కరివద్ద డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని వదిలేసి పోటీనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
నియోజకవర్గంలో వందలాది మంది పేదలు పుస్తెలు, ఇండ్లు, వ్యవసాయ భూములు కుదువపెట్టి డబ్బులు ఇచ్చారని, సమయం వస్తే బాధితులతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి రాజయ్య బండారం బయటపెడతాని హెచ్చరించారు. నీ చేష్టలు, మాటలు అన్నీ పార్టీ అధిష్టానం చూస్తోందని.. త్వరలోనే శిశుపాలుడి వధ జరుగుతుందని కడియం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment