న్యూఢిల్లీ: పార్టీలో సంస్కరణలు, నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల తీరుపై అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే లేఖ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక బీజేపీ హస్తం ఉందంటూ సందేహాలు లేవనెత్తారు. ఇక తాజాగా.. లేఖపై సంతకం చేసిన ఉత్తరప్రదేశ్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నాయకులు తీర్మానం చేయడం కలకలం రేపింది. గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జితిన్ తీరును ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: ‘తల్లిలాంటి వారు.. మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి’)
‘‘ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం జతిన్ ప్రసాద ఒక్కరే ఆ లేఖపై సంతకం చేశారు. ఆయన కుటుంబ చరిత్రను గమనిస్తే.. వాళ్లు గాంధీ ఫ్యామిలీకి ఎంత వ్యతిరేకులో అర్థమవుతుంది. సోనియా గాంధీకి పోటీగా నిలబడిన ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ సోనియాజీ మాత్రం జితిన్ ప్రసాదకు లోక్‌సభ టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. ఇందుకు ప్రతిగా ఆయన ఏం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. జితిన్ ప్రసాద తీరును తీవ్రంగా ఖండిస్తోంది’’ అని ప్రహ్లాద్ పటేల్ పేరిట ఉన్న ఓ లేఖ మీడియాలో చక్కర్లు కొడుతోంది.(చదవండి: అప్పుడే కాంగ్రెస్ కొత్త సారథి ఎన్నిక!?)
ఇక ఈ విషయంపై మరో సీనియర్ నేత, లేఖపై సంతకం చేసిన వారిలో ఒకరైన కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘‘యూపీ కాంగ్రెస్ జితిన్ ప్రసాదను టార్గెట్ చేయడం దురదృష్టకరం. ఇలా సమయం వృథా చేయడం కంటే బీజేపీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మంచిది’’అని ట్వీట్ చేశారు. ఇందుకు మరో నేత మనీశ్ తివారి మద్దతూ పలుకుతూ జితిన్‌కు అండగా నిలిచారు. కాగా గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, మనీశ్ తివారి, జితిన్ ప్రసాద తదితర 23 మంది నాయకులు పార్టీ అధినాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగాలని తీర్మానించింది. వాడివేడి చర్చల అనంతరం అసంతృప్త నేతలపై ఎలాంటి చర్యలు ఉండవని సోనియా స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment