
జనసైనికులు ఏదో ఆశిస్తుంటే.. యాచించే స్థితిలోనే ఇంకా ఉండిపోతారా? అంటూ..
పశ్చిమ గోదావరి, సాక్షి: మాజీ పార్లమెంటేరియన్, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా చురకలంటించారాయన.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో హరిరామ జోగయ్య లేఖ ద్వారా పవన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే.. బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య.
ఏపీలో 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు? అని లేఖ ద్వారా పవన్‌ను నిలదీశారు. ‘‘మిమ్మల్ని నమ్ముకున్నవాళ్లు, మీ నుంచి ఏదో ఆశిస్తున్నవాళ్లు.. మీ వైఖరి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పాలి’’ అని లేఖలో కోరారాయన.
ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి అనుభవస్తుని నాయకత్వమే కావాలంటూ పవన్ కల్యాణ్ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా హరిరామజోగయ్య ప్రస్తావించారు. అధికారం చేపట్టి.. బలహీనవర్గాలను శాసించే స్థితికి మీరు(పవన్) తెస్తారని జనసైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని లేఖ ద్వారా నిలదీశారాయాన.