అనంతపురం క్రైం: టీడీపీ హయాంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబునాయుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నాయకులు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ)ను పూర్తి చేస్తామని 2014లో చెప్పిన చంద్రబాబు మాట తప్పారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు రూ.950 కోట్లు మంజూరు చేశారంటూ నాడు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హడావుడి చేశారని అన్నారు. వైఎస్సార్ హయాంలో కేసీ కెనాల్ నుంచి హెచ్చెల్సీకి 10 టీఎంసీలు కేటాయిస్తే వాటిని రద్దు చేయించిన ఘనుడు కాలవ శ్రీనివాసులని మండిపడ్డారు. సీఎం జగన్ భైరవానితిప్ప ప్రాజెక్టు తొలివిడతలో రూ.240 కోట్లు విడుదల చేశారని, ఇప్పటికే రైతుల అకౌంట్లలో పరిహారం సొమ్ము జమ చేశారని తెలిపారు.
ఎన్నికలప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా ష్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే రైతులు, ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని విమర్శించారు. 1998లో హంద్రీ–నీవాకు, 2018లో జీడిపల్లి – పేరూరు డ్రిప్ ఇరిగేషన్ స్కీంకు శిలాఫలకాలేసి వదిలేశారని చెప్పారు. 560 కిలోమీటర్ల హంద్రీ–నీవా కాలువలో 125 కిలోమీటర్లకే పరిపాలన అనుమతులిచ్చి రైతులను మోసం చేశారన్నారు.
వైఎస్సార్ హయాంలో రూ.60వేల కోట్లతో 63 ప్రాజెక్టులు చేపట్టి, వాటిలో 23 పూర్తి చేశారన్నారు. మిగతా ప్రాజెక్టుల్లోనూ 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన 30 శాతం పనులకు చంద్రబాబు హయాంలో వంద నుంచి వెయ్యి రెట్లు అంచనాలు పెంచి, 15 శాతం పనులే చేసి రూ.60 వేల కోట్లు దోపిడీ చేశారని తెలిపారు. ఆ దోపిడీ సొమ్ముతో బాబుకు అత్యంత సన్నిహితులైన సీఎం రమే ష్, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు చార్టర్డ్ విమానాలు కొన్నారని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరూరు డ్యాంకు 2.7 టీఎంసీల నీరందించారని, పెన్నానదికి జీవం పోశారని తెలిపారు.
మభ్య పెట్టేందుకే: శంకరనారాయణ
రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే హంద్రీ–నీవా ప్రాజెక్టును చంద్రబాబు తాగునీటి ప్రాజెక్టుగా మార్చి తూట్లు పొడిచారని చెప్పారు. రైతుల కష్టాలు తీర్చడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవాను తిరిగి సాగునీటి ప్రాజెక్టుగా మార్చారని, ఆయన హయాంలోనే 80 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక మిగిలిన అరకొర పనులకు అంచనా వ్యయం భారీగా పెంచుకుని, ప్రజాధనాన్ని దోచేశారని విమర్శించారు.
ప్రాజెక్టులకు బాబే అడ్డంకి
రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబే అడ్డంకులు సృష్టిస్తున్నారని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ధ్వజమెత్తారు. మడకశిర బ్రాంచ్ కెనాల్‌ను నిర్విర్యం చేశారన్నారు. 2019లో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు వచ్చినా కదిరి ప్రాంత రైతులకు నీరివ్వకుండా కుప్పంకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఏకంగా రైతులపై కేసులు పెట్టారని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ హయాంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా 150 చెరువులకు నీరందించారని తెలిపారు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తే వర్షాలు పడవని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment