కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లా అయిన యాద్గిర్‌లో ఎన్నికల వేడి హోరెత్తిస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఇక్కడ హోరాహోరీ తలపడుతున్నాయి. బీమా నదీ పరివాహక ప్రాంతమైన ఈ జిల్లాలోని ఓ చిన్న భాగానికి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తుండడంతో ఇక్కడ వ్యవసాయాధారిత ప్రజలు ఎక్కువగా ఉంటారు. గుర్మిట్‌కల్‌లో కొంత మేర పరిశ్రమలు ఉండగా, షాహ్‌పూర్‌లో తెలుగు ప్రజలు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అయితే, రాజకీయంగా చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలు ఏకపక్షంగా లేరని, విలక్షణ తీర్పు ఇవ్వనున్నారని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. యాద్గిర్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి నియోజకవర్గాల వారీగా..
షాహ్‌పూర్
తెలుగు ప్రజల ప్రభావం కన్పించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంత మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ చాలా కాలంగా శరణబసప్ప, గురుపాటిల్ శిర్వాల్ కుటుంబాల మధ్యనే రాజకీయంగా వైరం ఉంది. ఈసారి కూడా కూడా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఈ కుటుంబాలకు చెందిన వారే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గతంలో జేడీఎస్ నుంచి పోటీ చేసిన అమీన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కుటుంబ రాజకీయ వైరంలో ఈయన ఈసారి కూడా వెనుకంజలో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
సుర్పూర్
ఇక్కడ ఓసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పోటీ మాత్రం 2008 నుంచి తలపడుతోన్న నరసింహనాయక్ (రాజగౌడ), రాజా వెంకటప్పనాయక్‌ల మధ్యనే కనిపిస్తోంది. నరసింహ నాయక్ బీజేపీ సిట్టింగ్‌కాగా, వెంకటప్పనాయక్ కాంగ్రెస్ పక్షాన బరిలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ నుంచి బరిలో ఉన్న కొత్త అభ్యర్థి శ్రవణ్‌కుమార్ నాయక్ ప్రభావం తక్కువగానే ఉంది. కురబ యాదవ సామాజిక వర్గం ఇక్కడ ప్రభావిత శక్తి కాగా, బీజేపీ వైపు కొంత సానుకూలత కనిపిస్తోంది.
గుర్మిట్‌కల్
ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోరు నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో జేడీఎస్ పక్షాన గత ఎన్నికల్లో గెలిచిన నాగనగౌడ కుమారుడు శరణ గౌడకు టికెట్ లభించింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూరావు చించన్‌సూర్, బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి లలితా అనపూర్ తలపడుతున్నారు. ఈ ఇద్దరి సామాజిక వర్గం ఒకటే. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే కోలీ (ముదిరాజ్) వర్గానికి చెందిన ఇద్దరిలో కొంత మొగ్గు బాబూరావు వైపే కనిపిస్తున్నా లలిత చీల్చే ఓట్లను బట్టి గెలుపోటములు నిర్ధారణ కానున్నాయి. ఇక్కడి ప్రజలు జేడీఎస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది.
యాద్గిర్
లింగాయత్ సామాజికవర్గ ప్రభావం కనిపించే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌నుంచి మాజీ ఎమ్మెల్సీ చెన్నారెడ్డి పాటిల్ బరిలో ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన
ఎ.బి.మలక్‌రెడ్డి ఈసారి జేడీఎస్ పక్షాన పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వెంకట్‌రెడ్డి ముద్నాల్ బరిలో ఉన్నారు. జేడీఎస్ ఇక్కడ బలహీనంగా ఉన్నప్పటికీ మలక్‌రెడ్డి రాకతో పోటీలోకి వచ్చింది. మొత్తంగా బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది.
చదవండి: మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి
Comments
Please login to add a commentAdd a comment