Karnataka Bans: Clothes That Disturb Law Amid Hijab Saffron Scarves Row Viral - Sakshi
Sakshi News home page

హిజాబ్‌ వర్సెస్‌ కండువా.. కర్ణాటక సర్కార్‌ కీలక ఉత్తర్వులు! ఏం చెప్పిందంటే..

Published Sun, Feb 6 2022 8:50 AM | Last Updated on Sun, Feb 6 2022 10:53 AM

Karnataka Bans Clothes That Disturb Law Amid Hijab Saffron Scarves Row - Sakshi

కర్ణాటకలో ‘హిజాబ్‌’ వివాదం.. పార్టీల పరస్పర రాజకీయ విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వివాదం మరింత ముదరకముందే చెక్‌ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ‍్క్షలు జారీ చేసింది. 

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఉడుపి, చిక్‌మగళూరులో పరిణామాలు వాడీవేడిగా సాగాయి. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోగా.. ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ తరుణంలో.. కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో.. వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అయ్యింది.  దీంతో శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది కర్ణాటక ప్రభుత్వం. 

ఎంపిక చేసిన డ్రెస్‌ కోడ్‌
కర్ణాటక విద్యా చట్టం-1983లోని సెక్షన్‌ 133 (2) ప్రకారం.. యూనిఫాం ఒకే తరహా దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తమకు నచ్చిన యూనిఫామ్‌ను ఎంచుకోవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్‌నే అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాంను ఎంపిక చేయని సందర్భంలో..  సమానత్వం, సమగ్రత మరియు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఆ ఉత్తర్వులు పేర్కొనడం గమనార్హం. కొన్ని విద్యాసంస్థల్లో బాలబాలికలు తమ మతం ప్రకారం ప్రవర్తించడంతో సమానత్వం, ఐక్యత దెబ్బతింటున్నట్లు తాము గుర్తించామని ఈ సందర్భంగా విద్యాశాఖ పేర్కొంది.

సమీక్షల అనంతరం..
ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించడంపై అభ్యంతరాలు(తరగతి గదుల్లో మాత్రం వద్దనే) వ్యక్తంగా.. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి.. ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. మరోవైపు హిజాబ్‌ వ్యవహారం కోర్టు గడప తొక్కగా(హిజాబ్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ.. ఐదుగురు బాలికల తరపున పిటిషన్‌ దాఖలైంది).. మంగళవారం​(ఫిబ్రవరి 8న) పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. విద్యా శాఖతో, న్యాయ శాఖతో సంప్రదింపులు జరిపారు. శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక బాలికలు తరగతుల్లో హిజాబ్‌ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ‘తాలిబనైజేషన్‌’ ప్రోత్సహించినట్లు అవుతుందంటూ బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానిస్తు‍న్నారు. మరోవైపు కాంగ్రెస్‌ హిజాబ్‌ విషయంలో బాలికలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్‌ గాంధీ సైతం స్పందించారు. ఇక ఈ వ్యవహారంపై మాజీ సీఎంల స్పందన మరోలా ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై మండిపడగా, హెచ్‌డీ కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు అనుమతించబడిన ప్రదేశాలలో హిజాబ్‌లను అనుమతించండి, ఈ మధ్య పర్మిషన్‌ ఇచ్చిన ప్లేసుల్లో మాత్రం నిషేధించండి’ అంటూ కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement