బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. హిజాబ్, హలాల్, అజాన్, వంటి వివాదాలతో అట్టుడికిన రాష్ట్రంలో తాజాగా మరో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం చెడ్డీ వార్ నడుస్తోంది. కాషాయపు నిక్కర్లు తగలబెడతామన్న కాంగ్రెస్ బెదిరింపులపై తాజాగా బీజేపీ ఎంపీ రమేష్ జిగజినాగి స్పందించారు. ఈ మేరకు హస్తం పార్టీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెడ్డీలను ఊడగొట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటక జనాలు కూడా అదే పనిచేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే కాంగ్రెస్ నాయకులు పదే పదే చెడ్డీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లకు చెడ్డీ తప్ప మరేం కనిపించడం లేదని, అందుకే చడ్డీని పట్టుకొని లాగుతున్నారని విమర్శించారు.
అసలు ఏంటి ఈ చడ్డీ వివాదం?
కర్ణాటకలో విద్యా విధానానికి వ్యతిరేకంగా తుముకూరు జిల్లాలోని తిప్టూరులో ఈనెల 1వ తేదీన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నిరసనలు చేపట్టింది. విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు బీసీ నగేష్ ఇంటి ముందు ఖాకీ నిక్కర్లను తగలబెట్టడంతో చడ్డీ వివాదం ప్రారంభమైంది. అదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా చెడ్డీలను తగుల బెట్టాలని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య పిలుపునిచ్చారు. సిద్ధూ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత రాజుకుంది.
అయితే కాంగ్రెస్ విద్యార్థి విభాగం సభ్యులు తన ఇంట్లోకి చొరబడి నిప్పటించారని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఆరోపించారు. ప్రభుత్వంపై దాడి చేసేందుకు మరే ఇతర కారణం లేకపోవడం వల్ల ‘చెడ్డీ కాల్చడం’ వంటి దిగజారుడు విన్యాసాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు చేపట్టింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా ఆర్‌ఎస్సెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిక్కర్ పార్సిళ్లను పంపుతున్నారు. అయితే, తమకు ఎటువంటి పార్సిళ్లు అందలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
చదవండి: పల్లె రఘునాథరెడ్డి నుంచి నుంచి ప్రాణహాని
Comments
Please login to add a commentAdd a comment