సాక్షి, బెంగళూరు: నాయకత్వ సంక్షోభం సుడులు తిరుగుతుండగా, సీఎం యడియూరప్ప తన శక్తిని చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బోర్డు, కార్పొరేషన్ అధ్యక్షులతో సమావేశాలు జరుపుతూ నా బలం ఇదీ అని ప్రదర్శిస్తున్నారు. గురువారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బోర్డు, కార్పొరేషన్ అధ్యక్షులు సీఎంను కలిశారు. మీరు సీఎం పదవి నుంచి తప్పుకోరాదని పట్టుబట్టారు.
సీఎం నివాసం కావేరిలో హోం మంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు జే.సీ.మాధుస్వామి, అంగార, మరికొందరు యడియూరప్పను కలిసి రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. తరువాతర వీరందరూ పార్టీ ఇన్‌చార్జ్ అరుణ్‌సింగ్‌ను కలవాలని అనుకున్నా సీఎం వద్దని వారించారు. సెవెన్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్న సీఎం రాజకీయ కార్యదర్శి ఎం.పీ.రేణుకాచార్య ఇంట్లోనూ సీఎం మద్దతుదారులైన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వారు కూడా అరుణ్‌సింగ్‌ను కలిసి యడ్డికి మద్దతుగా గొంతు వినిపించాలని అనుకున్నారు. కానీ చివరక్షణంలో భేటీని రద్దు చేసుకున్నారు.
యడ్డిపై యోగీశ్వర్, యత్నాళ్ ధ్వజం
యడియూరప్పపై తిరుగుబాటు వర్గంలోనున్న మంత్రి సీపీ యోగీశ్వర్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్ మరోసారి భగ్గుమన్నారు. యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటు కావడానికి సహకరించిన తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారని, కానీ రామనగర జిల్లా ఇన్‌చార్జ్ ఇవ్వలేదని సీపీ యోగీశ్వర్ దుయ్యబట్టారు. రామనగరలో డీకే శివకుమార్, చెన్నపట్టణలో హెచ్‌డీ కుమారస్వామితో యడియూరప్పకు ఒప్పందం ఉందని, వారు అడిగిన అధికారులను నియమిస్తారని విమర్శించారు. యత్నాళ్ మాట్లాడుతూ యడ్డి ప్రభుత్వంలో అవినీతి, సీఎం తనయుడు విజయేంద్ర జోక్యం పెరిగిపోయిందన్నారు. యడ్డికి ఆరోగ్యం, వయసు మీరింది, ఆయనను మార్చాలని అన్నారు.
గొడవలు మావల్లే: జార్కిహొళి
మరో రెండేళ్ల పాటు యడియూరప్ప సీఎంగా కొనసాగుతారని మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో బీజేపీలో గందరగోళం నెలకొందని మంత్రి ఈశ్వరప్ప అనడంలో తప్పు లేదన్నారు. తాము యడియూరప్ప, అమిత్‌షాను నమ్ముకొని బీజేపీలోకి వచ్చామన్నారు. కోపతాపాలు ఉంటే పిలిపించి పరిష్కరించాలన్నారు. తాను సీఎం రేస్‌లో లేనని మంత్రి మురుగేశ్ నిరాణి అన్నారు. ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నారని యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్.విశ్వనాథ్ ధ్వజమెత్తారు.
సర్కారును రద్దు చేయాలి: సిద్ధు
శివాజీనగర: అధికార బీజేపీలో అంతర్గత కలహాలతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది, అందుచేత గవర్నర్ తక్షణం యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చూడాల్సిన మంత్రులు ఆఫీసులకు వెళ్లకుండా బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తంలో రాష్ట్రంలో ప్రభుత్వమే లేనట్లయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు.
నా ఫోన్ ట్యాపింగ్: బెల్లద్
బనశంకరి: తన ఫోన్ ట్యాపింగ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ పరోక్షంగా సీఎం యడియూరప్పపై ఆరోపణలు చేశారు. నగరంలో అరవింద్ బెల్లద్ విలేకరులతో మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం రాజస్వామి అనే వ్యక్తి ఫోన్ చేసి తనను అనవసరంగా జైలుకు పంపించారని వాపోయాడన్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని, దీనిపై స్పీకర్, హోంమంత్రి, డీజీపీకి లేఖ రాశానన్నారు. జైలులో ఉన్న వ్యక్తికి నా ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారనేది విచారించాలన్నారు.
నేను జ్యోతిష్యుణ్ని కాను
దొడ్డబళ్లాపురం: బీజేపీలో ఎవ్వరూ లక్ష్మణరేఖ దాటడం లేదు. అయితే రాబోవు రోజుల్లో ఏం జరగబోతోందో నేను చెప్పలేనని, తాను జ్యోతిష్యున్ని కానని డీసీఎం అశ్వత్థనారాయణ అన్నారు. రామనగర పట్టణంలో గురువారం రోటరీ బీజీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ ఇప్పటికే నాయకత్వ మార్పునకు సంబంధించి స్పష్టం చేసారన్నారు. అరుణ్ సింగ్ రాష్ట్రానికి రావడాన్ని భూతద్దంలో చూడవద్దన్నారు. ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందన్నారు. నాయకత్వ మార్పుపై తాను ఏమీ మాట్లాడబోనని అన్నారు.
చదవండి: నా పదవికి ఢోకా లేదు: సీఎం
Comments
Please login to add a commentAdd a comment