సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉంటే తెలంగాణలో బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీకి బీఆర్‌ఎస్ ప్రొటెక్షన్ ఫండ్ (రక్షణ నిధి) ఇస్తున్నందున బీఆర్‌ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ కలిసే ఉన్నాయని ప్రజలకు అర్థం అయిందని అన్నారు.
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి, కసిరెడ్డి మాట్లాడారు.
అవగాహనలో భాగంగానే మోదీ పర్యటనలు
అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందని రేవంత్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నిలువరించేందుకు ఏ విధంగా అయితే తమ ఓట్లన్నీ బీఆర్‌ఎస్‌కు బదిలీ అయ్యేలా బీజేపీ పథకం రచించిందో.. అదే విధంగా ఈసారి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అన్నారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇన్నిసార్లు తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9, బీజేపీ 7, ఎంఐఎం 1 స్థానంలో కలిసి పోటీ చేయనున్నాయని చెప్పారు.
బిల్లా, రంగాలు తెలంగాణను దోచుకున్నారు
గత కొద్దిరోజులుగా తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక రకమైన దోపిడీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకమైన దోపిడీ చేశారని రేవంత్ ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయలు, ధరణి రూపంలో వేల ఎకరాల భూములను బిల్లా, రంగాలు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో తండ్రి కేసీఆర్‌ను అడగాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. 2004లో సోనియాగాంధీ బిచ్చమేస్తే ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌రావు మంత్రి అయిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు మరుగుజ్జులు అయితే కేసీఆర్ ఏమైనా బాహుబలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబట్లో తెడ్డులా బీజేపీ ఉందని, వారికి అభ్యర్థులు లేరు.. మేనిఫెస్టో లేదని రేవంత్ విమర్శించారు. ఏఐసీసీ నేత వంశీచంద్ రెడ్డి తాను పోటీ చేసే స్థానాన్ని కసిరెడ్డికి ఇచ్చినందుకు అభినందిస్తున్నానని అన్నారు. కాగా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని కసిరెడ్డి చెప్పారు. ప్రాజెక్టుకు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment