సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీరియస్‌గా దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్ని కలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా గడువు ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని ఓ వైపు సంకేతాలు ఇస్తూనే మరోవైపు ఎన్నికలు లక్ష్యంగా పార్టీని చక్కబెట్టాలని భావిస్తున్నారు. నిఘా సంస్థల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా పరిస్థితిని మదింపు చేస్తూనే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. విపక్షాలు చేస్తున్న హడావుడి రాష్ట్ర రాజకీయాలపై ఎంత మేర ప్రభావం చూపుతుంది? పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా? అనే కోణంలో లెక్కలు కడుతు న్నారు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షా లకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దు బాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. కాగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అధినేత కేసీఆర్‌కు వివిధ రూపాల్లో నివేదికలు చేరుతుండటంతో పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. సర్వేల నిర్వహణకు ప్రశాంత్ కిషోర్ బృందంతో టీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తుండటంతో వారిచ్చే ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందనే కోణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
అధ్యక్షుడి దృష్టికి పలు అంశాలు
– ముగ్గురు మంత్రులు స్థానిక వివాదాల్లో తలదూర్చడం, ఓ మంత్రి తన జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పరచడంలో విఫలం కావడాన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది.
– ఖమ్మం జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒకే స్థానానికి పరిమితం కావడం, వలసలు ప్రోత్సహించినా పార్టీ పరిస్థితి మెరుగు కాకపోవడానికి గల కారణాలపై సర్వే ద్వారా వివరాలు రాబడుతున్నారు.
– ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన చోట పాత కొత్త నేతల నడుమ తీవ్రమైన సమన్వయ లోపం ఉన్నట్లు గుర్తించారు. తాండూరు, నకిరేకల్, కొల్లాపూర్ వంటి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలో చాలాచోట్ల ఈ తరహా పరిస్థితి ఉన్నట్లు తేలింది.
– ఆదిలాబాద్‌లో ఒకటి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో రెండు, నల్లగొండలో మూడు, రంగారెడ్డిలో నాలుగేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్తాయిలో లేదని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఆశలు
ఒకవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా కేసీఆర్ కసరత్తు కొనసాగిస్తుంటే.. మరోవైపు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మేలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఎనిమిది నెలలుగా కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గంలో స్వల్పమార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పుడనేది అంతు చిక్కడం లేదు. గత నెలలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొంత వేగం పుంజుకున్నట్లు కనిపించినా ముందుకు సాగడం లేదు. పార్టీ జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల ఏర్పాటు ఉంటుందని చెబుతున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, పార్టీ యంత్రాంగానికి సంస్థాగత శిక్షణ కార్యక్రమాలు కూడా ముందుకు సాగడం లేదు.
ఫిబ్రవరిలో కేసీఆర్ జిల్లాల పర్యటన!
వాస్తవానికి గత ఏడాది చివరి నుంచే పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినా కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఫిబ్రవరి రెండో వారం నుంచి సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్లేలా షెడ్యూలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
యువత, కొత్తవారికే పెద్దపీట..
మొత్తం 119 మంది అసెంబ్లీ సభ్యులకు
గాను టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 103 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో 65 మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 మందికి పైగా సభ్యులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో యువత, కొత్తవారికి పెద్దపీట వేసేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment