వ్యూహ రచన: కేసీఆర్‌తో ఒవైసీ భేటీ | KCR Meeting With Asaduddin owaisi | Sakshi
Sakshi News home page

వ్యూహ రచన: కేసీఆర్‌తో ఒవైసీ భేటీ

Published Thu, Nov 12 2020 8:44 PM | Last Updated on Thu, Nov 12 2020 8:56 PM

KCR Meeting With Asaduddin owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)పై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే స్థానిక నేతలను, మం‍త్రులను రంగంలోకి దించింది. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుతూనే రాజకీయంగా వ్యూహరచన చేస్తోంది. పొత్తులు ఎత్తులపై ప్రగతి భవన్‌ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇప్పటికే విడతల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఇక దుబ్బాక విజయం నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ సైతం రేసులోకి దూసుకొచ్చింది. గ్రేటర్‌లో 75 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని కాషాయ దళపతి బండి సంజయ్‌ ఇదివరకే ప్రకటించారు. దుబ్బాక విజయం తమకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిందని, అదే స్ఫూర్తితో గ్రేటర్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. బీజేపీ నుంచి ముంచుకొస్తున్న ముప్పును అంచనా వేసిన గులాబీ బాస్‌ కేసీఆర్‌  ఆ మేరకు ఎత్తులు సైతం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. గురువారం ప్రగతిభవన్‌ వేదికగా సాగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్లు సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే ఫలితాలను సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇరు పార్టీలు ముందగానే అవగాహానకు వచ్చి ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్‌ మొదటివారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ యోచిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement