
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం కోర్టు మరో నాలుగు రోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్(8297324624)ను ప్రారంభించారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తమ సందేశం తెలియజేయాలనుకునే కార్యకర్తలు, అభిమానుల కోసం ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని శుక్రవారం తెలిపారు. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా వందల సంఖ్యలో అభిమానాలు కేజ్రీవాల్ కోసం సందేశాలు పంపుతున్నారని అన్నారు.
‘సీఎం కేజ్రీవాల్‌ను ఎంత ప్రేమిస్తున్నారో మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ సంఘీభావ సందేశం సీఎం కేజ్రీవాల్ వరకు చేరుతుంది. ఆయన వాటన్నింటిని ప్రేమతో చదువుతారు. మీరు ఆప్ పార్టీకి చెందినవారే కానవసరం లేదు. మీరంతా ఆయన త్వరగా బయటకు రావాలని ఆశీర్వదించండి’ అని సునీతా కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. గురువారం వరకు సీఎం కేజ్రీవాల్ ఆరురోజుల కస్టడీ ముగియగా.. రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారన్నారు. వారికి ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు.
కోర్టు కస్టడీ పొడగించిన అనంతరం.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరోగ్యం సరిగా ఉండటం లేదు. మీ సీఎం అక్కడ వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలి’అని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. ఇక.. మర్చి 21న అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. ఏప్రిల్ 1 వరకు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment