సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అన్ని సీట్లను కైవసం చేసుకోవడంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. జిల్లా పరిధి లో చేసిన అభివృద్ధిని ప్రచారం చేయడం, నేతలందరినీ ఏకతాటిపై ఉంచడం, విస్తృతంగా సమావేశాలు నిర్వహించి పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా మిగతా 3వ పేజీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేయాలని, ఇందుకోసం వచ్చే పదిహేను రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని తీర్మానించింది.
ఈ మేరకు ఆదివారం రాత్రి ఖమ్మంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లాలో చేసిన పర్యటన, ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించాలని.. మాజీ ఎంపీ పొంగులేటి వెంట కేడర్ వెళ్లకుండా బ్రేక్ వేయాలనే అంశాలపైనా చర్చించినట్టు తెలిసింది.
సీఎం హామీలు ప్రచారం చేసేలా..
సీఎం కేసీఆర్ గతనెల 12న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్, పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించారు. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక గత నెల 18న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభలో.. ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున, తల్లాడ, కల్లూరు, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున.. 589 పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా 15 రోజుల పాటు విస్తృతంగా పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు.
నేతలంతా కలిసి ముందుకు..
బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం నేపథ్యంలో ఈ ఊపును కొనసాగించి అన్ని నియోజకవర్గాల్లో పాగా వేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా నాయకత్వం భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సీఎం ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు చర్చించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలంతా నియోజకవర్గాల్లో కలిసి తిరగాలని తీర్మానించినట్టు సమాచారం.
కేడర్ కారు దిగకుండా..
బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తిలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తిరుగుబావుటా ఎగురవేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. పార్టీపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. పొంగులేటి బాటలో నడిచిన వైరా మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మరికొందరు నేతలపై బీఆర్‌ఎస్ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా పొంగులేటి వెంట వెళ్లిన నేతలపై చర్యలు తీసుకోవాలని తాజా సమావేశంలో తీర్మానించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండలాల వారీగా ముఖ్య నేతలతో టచ్‌లో ఉండి నిత్యం పార్టీ కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాసం, మరికొన్ని స్థానిక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ భేటీలో ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి షాక్!
Comments
Please login to add a commentAdd a comment