సాక్షి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ ఎత్తున తుక్కుగూడలో(రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో) బహిరంగ సభకు సిద్ధమవుతోంది. అయితే ఈ సభకు సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయగా.. అది రసాభాసకు దారి తీసింది. సీనియర్ నేత వీహెచ్ మాట్లాడే సమయంలో కార్యకర్తలు అడ్డుపడడంతో.. ఆయన వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఖమ్మంలో తుక్కగూడ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌తో పాటు వీ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నియోజకవర్గ ఇంఛార్జిలు, కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే వీహెచ్ మాట్లాడే సమయంలో కొందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జిల్లాలో మీ కో అర్డినేషన్ ఏమిటి? అంటూ వీహెచ్పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీహెచ్ సైతం కౌంటర్‌గా వాళ్లపై మండిపడ్డారు. దీంతో.. అరుపులు కేకలు వేసిన కార్యకర్తలపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కార్యకర్తలు ఎవరికి వారే.. ‘జై పొంగులేటి’, ‘జై రేణుకా చౌదరి’, ‘జై భట్టి’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా తయారైంది.
పెద్దల్ని గౌరవించండి
మనలో మనం కొట్టుకుంటే పార్టీకే నష్టమంటూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పొంగులేటి, రేణుకాచౌదరి. పార్టీ పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ లో గ్రూప్ గొడవలు ఉండొద్దు. అందరం కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పది కి పది స్థానాలు గెలుస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
‘‘నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉంది. నలభై ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదు. పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగాలి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఖబర్దార్ అజయ్ కుమార్(మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఉద్దేశించి).. దమ్ముంటే రా. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు. గాలి మారిపోయింది. రాబోయేది కాంగ్రెస్.. ఉండబోయేది కాంగ్రెస్.. గుర్తుంచుకో. కేసీఆర్, మోదీ తోడు దొంగలు. ఈ విషయం.. కవిత లిక్కర్ కేసుతో రుజువైందని రేణుక చౌదరి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment