లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొత్త నాటకానికి తెరతీశాయి
ఈ రెండు పార్టీలు అధికారం.. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాయి
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. మొన్నటివరకు రాహుల్‌గాంధీని తిట్టిన ఒవైసీ బ్రదర్స్..ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ కొత్త నాటకానికి తెరతీశాయన్నారు. ఈ రెండూ మజ్లిస్‌కు కొమ్ము కాసేవేనని..ఈ పార్టీలు అధికారం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారు తాయని, దీనిని ప్రజలు గ్రహించాలని కోరారు. ఈ మూడింటి డీఎన్‌ఏ ఒకటేనని.. హిందూ వ్యతిరేకవైఖరే ఈ పార్టీల విధానమని ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, ఓడించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నదని మండిపడ్డారు.
గురువారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఇతరనేతల సమక్షంలో గ్రేటర్ మాజీ కార్పొరేటర్ బంగారు ప్రకాష్, చెన్నూరు ఎంపీపీ సురేఖ రామయ్య, ఎంపీటీసీలు, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తూ ఎంఐఎం దుశ్శాసన పాత్ర పోషించిందని మండిపడ్డారు. ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగే పార్టీ ఎంఐఎం అని, పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకున్నది ఆ పార్టీనేనని ధ్వజమెత్తారు. అక్కడి ప్రజల బతుకులను చీకటిలోనే మగ్గేలా చేస్తోందన్నారు.
ఎంఐఎంకు రెండు ఎజెండాలున్నాయని.. ఒకటి తన చీకటి వ్యాపారానికి అండ కోసం ప్రభుత్వంతో ఉండటం, రెండోది బీజేపీని వ్యతిరేకించడమన్నారు. మజ్లిస్ కాళ్ల వద్ద కూర్చొని కేసీఆర్ దుర్మార్గమైన పాలన సాగించారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. దేశ్‌కీనేత కేసీఆర్‌ను వదిలేసి, ఆ పార్టీ చెంతకు చేరారని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు కేసీఆర్ ఫ్యామిలీ, ఒవైసీ ఫ్యామిలీ కలిసి ఉంటే.. ఇప్పుడు సోనియా ఫ్యామిలీ ఒవైసీ ఫ్యామిలీగా మారిపోయిందన్నారు.
మజ్లిస్‌కు భయపడి చెంగిచర్ల దాడి నిందితులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓడిపోవద్దని కాంగ్రెస్ డిసైడ్ అయ్యిందని, తనకు ఇష్టం లేకపోయినా ఆయన్ను గెలిపించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇటీవల చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో స్టోరీ పాతదేనని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాత్రలు మారాయని కిషన్‌రెడ్డి చెప్పారు ఈ సమావేశంలో అమర్‌సింగ్, డా.ఎన్.గౌతమ్‌రావు, నూనె బాలరాజ్, అట్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment