సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రసుగా మారిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా మద్యంపై చంద్రబాబు, టీడీపీ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సోమిరెడ్డి, బోండా ఉమా, అనిత నోటి నుంచి వస్తున్న మద్యం బ్రాండ్లన్నీ బీ–బ్రాండ్లు, సీ–బ్రాండ్లేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన చంద్రబాబుకు ‘శ్రీమాన్ మద్య మహా చక్రవర్తి’, ‘మద్య మహా సామ్రాట్’ అనే బిరుదులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ మెడల్స్ అన్నీ చంద్రబాబు మెడలోనే వేయాలన్నారు.
గోబెల్స్ కంటే ఘోరంగా అబద్ధాలను ప్రచారం చేయగల దిట్ట చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. అధికారం, దోచుకోవడం, తనవాళ్లకు అంతులేకుండా దోచిపెట్టడం తప్పితే.. ప్రజలకు సాయం చేయాలనే భావన ఆయనకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. పార్థసారథి ఇంకా ఏమన్నారంటే..
ఈ డిస్టిలరీలు ఎవరివి?
► విశాఖ డిస్టిలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా? పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణా డిస్టిలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా? ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా? వీరంతా టీడీపీ వారు కాదా? వీటన్నింటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు కాదా?
► రాష్ట్రంలో చీప్ లిక్కర్ వల్ల ఎటువంటి మరణాలూ సంభవించలేదు. అవన్నీ టీడీపీ, ఎల్లో మీడియా వండి వార్చిన మరణాలు మాత్రమే. పొగ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. మద్యం సేవించడం కూడా అంతే హానికరం అన్నది గుర్తెరగాలి.
► ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్.. ఇలా గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకూ చంద్రబాబు ఎవరినైనా వాడేస్తారు. ఈ పేర్లతో ఉన్నవన్నీ బాబు బ్రాండ్లు కాబట్టి బీ బ్రాండ్లు అనో, లేదా చంద్రబాబు బ్రాండ్లు కాబట్టి, సీ బ్రాండు అనో అనాలి. ఇంతకాలం జె బ్రాండ్లని తప్పుడు ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
► 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి, ఒక బ్రూవరీకి సీఎం జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది.
బాబు హయాంలోనే అనుమతులు
► ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరి 6న అనుమతి లభించింది. గవర్నర్స్ రిజర్వ్ బ్రాండ్‌కు 2018 నవంబరు 5న, హైదరాబాద్ విస్కీ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.
► గవర్నర్ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు, సెవెన్త్ హెవెన్ పేరు మీద ఉన్న బ్రాండ్లు.. వీటన్నింటికీ ఏపీ స్టేట్ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018 అక్టోబరు 26న అనుమతి ఇచ్చింది. ఈ బాటిల్స్‌ను బాబు మెడలో, సోమిరెడ్డి మెడలో, అనిత మెడలో వేయాలి. అయ్యన్నపాత్రుడి మెడలో మాత్రం వేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన గంజాయి మాత్రమే తాగుతారు.
► విరా, బ్లాండే లాంటి బ్రాండ్లతో పాటు బూమ్ బీరు తీసుకు వచ్చింది చంద్రబాబే. 2019 మే 14న బూమ్ బీరుకు అనుమతి ఇచ్చారు.
► హై ఓల్టేజి గోల్డ్ బీరు, ఎస్ ఎన్ జే బీరు, బ్రిటీష్ ఎంపయర్ బీరు.. ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందీ 2017 జూన్ 7న. రాయల్ ప్యాలెస్ బ్రాండ్లు, లూహీ 14 బ్రాండ్లు, సైనవుట్ బ్రాండ్లు రంగ ప్రవేశం చేసింది 2018 నవంబరు 9న. వీటన్నింటిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారు?
‘అవన్నీ బీ బ్రాండ్లు.. సీ బ్రాండ్లే.. ఈ మెడల్స్ అన్నీ చంద్రబాబు మెడలో వేయాలి’
Published Sun, Mar 20 2022 3:19 AM | Last Updated on Sun, Mar 20 2022 8:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment