సాక్షి, హైదరాబాద్ : కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్ ఢిల్లీకి మారుతోంది. కాంగ్రెస్ ‘మార్కు’రాజకీయం మొదలైంది. ‘అయిననూ పోయి రావలె హస్తిన’కు అన్నట్లుగా నాయకులు ఢిల్లీ బాట పట్టనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిన పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ వెళ్లిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది. ఫలానా నాయకుడికి ఈ పదవి వస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో... అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిం చాలని కోరుతూ అధిష్టానాన్ని కలిసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు సోమవారం ఢిల్లీకి బయలుదేరనున్నట్టు సమాచారం. వీరి వెనుకే మంగళవారం జగ్గారెడ్డి కూడా హస్తిన బాట పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా సోనియా, రాహుల్‌గాంధీల అపాయింట్‌మెంట్ కోరి రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ జరిగిన తీరుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అందరినీ ఎలా అడుగుతారు?
టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పార్టీకి సేవ చేస్తున్న వారినే ఈ పదవికి ఎంపిక చేయాలని కొందరు, పార్టీకి ఊపు తెచ్చే స్పీడున్న నాయకుడికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. పాతకాపులకే పగ్గాలు ఇవ్వాలని కోరుతున్న నాయకులు అసలు అభిప్రాయ సేకరణే సరిగా జరగలేదని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా మొత్తం 160 మందిని పిలవడం ఏఐసీసీ నియమావళికి విరుద్ధమని వారంటున్నారు. ఈ మేరకు సోనియా, రాహుల్‌లకు ఇచ్చేందుకు ఫిర్యాదును కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే, పార్టీని ఉత్తేజపరిచే నాయకుడికి బాధ్యతలు అప్పగించాలంటోన్న మరోవర్గం మాత్రం పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత సాయంతో ఢిల్లీలో పావులు కదుపుతోంది. ఈ రెండు గ్రూపుల ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం ప్రస్తుతం రక్తి కడుతోంది. నాయకుల ఢిల్లీ బాటలపై ఓ ముఖ్యనేత ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లడం సహజమే. ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం లేదు. పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం మరో రెండు రోజుల్లో తన నివేదికను అధిష్టానానికి ఇచ్చే అవకాశముంది. అప్పుడు మమ్మల్ని ఢిల్లీ పెద్దలు పిలిచి ముఖ్యులతో మాట్లాడిన తర్వాత మాత్రమే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ ఎప్పటికి ముగుస్తుందో... కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఆ తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment