సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన అనంతరం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనను అనవసరంగా రెచ్చగొట్టొద్దని, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కానీ ఇంతవరకు రేవంత్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆయన్ను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నట్టు వెంకట్‌రెడ్డి సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ స్పందించకపోవడాన్ని కూడా వెంకట్‌రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన కొందరు కాంగ్రెస్ నేతల వద్ద సైతం ఆయన రేవంత్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుపట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తనను, తన కుటుంబాన్ని అవమాన పరిచేలా రేవంత్ మాట్లాడినా, మాణిక్యం ఠాగూర్ తప్పుపట్టకపోవడాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
రేవంత్‌తో లాభం ఏమీ ఉండదు!
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించాక ఆయన వ్యవహారం అంతా వివాదాస్పదంగానే ఉందని, సీనియర్లను కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని, ఆయనతో పార్టీకి నష్టం తప్పితే, ఒనగూరే లాభం ఏమీ ఉండదని సన్నిహితుల వద్ద వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అనేక చోట్ల పార్టీల్లో గ్రూపులు ప్రోత్సహించడం, హైకమాండ్ నిర్ణయాలకు విరుద్ధంగా అభ్యర్థులను ప్రకటించడం, నేతలెవరికీ అందుబాటులో ఉండక పోవడం, మాణిక్యం ఠాగూర్‌తో చేసుకున్న చీకటి ఒప్పందాలతో పార్టీ పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నట్టు చెబుతున్నారు. రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఐదారుగురు సీనియర్ నేతలతో మాట్లాడిన సమయంలో వారూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీ ఏ పని అప్పగిస్తే ఆ పని నిర్వర్తించేందుకు సిద్ధమని ప్రకటించాక కూడా రేవంత్ క్షమాపణ చెప్పకపోవడాన్ని సీనియర్లు తప్పుపట్టినట్లు చెబుతున్నారు.
రేవంత్‌పై అధిష్టానం ఆగ్రహం?
కోమటిరెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, తాజాగా కోమటిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, సీనియర్లను కలుపుకొని మునుగోడులో విజయంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. తమ్ముడి రాజీనామాతో(కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి) సంబంధం లేదు.. నా తమ్ముడి రాజీనామాతో నాకు సంబంధం లేదు. కాంగ్రెస్‌కు విధేయుడిగా, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తా. నేను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా కుటుంబంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మీడియాతో వెంకట్‌రెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: ఆ విషయంలో బీజేపీ వెనుకంజ!
Comments
Please login to add a commentAdd a comment