సాక్షి, మంచిర్యాల: కాంగ్రెస్ సీనియర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్టు ఎన్నోసార్లు ప్రచారం చేశారని, అయినా తాను పార్టీ మారలేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. పార్టీ నుంచి మహేశ్వర్‌రెడ్డి వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు.
కాగా, కోమటిరెడ్డి మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదు. దళిత బంధు పథకం బీఆర్‌ఎస్ నేతలకు దోపిడీగా మారింది. న్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదు. 16శాతం ఉన్న మాదిగలకు ఇప్పటికీ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు.
ఇదే సమయంలో దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. అలాగే, కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. మరోవైపు, రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు. భట్టి విక్రమార్క పాదయాత్రనే నా పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని ఖర్గేను కోరతాము అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తానంటే గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని మండిపడ్డారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా.. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment