సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ పార్టీలో కూడా వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది.
ఇక.. సోనియా, ప్రియాంక భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను సోనియాకు వివరించాం. అలాగే, భట్టి విక్రమార్క పాదయాత్ర, ప్రియాంక గాంధీ సభలపై కూడా చర్చించాము. ఖమ్మం, నల్లగొండ సభలకు సోనియా, ప్రియాంకను ఆహ్వానించాను. వీలుంటే సభకు సోనియా వస్తానని హామీ ఇచ్చారు. జూలై 7వ తేదీ తర్వాత తెలంగాణ పర్యటన తేదీ చెబుతామన్నారు.
ప్రతీ 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంకను కోరాను. ఈ మూడు నెలల్లో 33 జిల్లాలు కవర్ చేయాలని ప్రియాంకను కోరాం. కర్ణాటక తరహాలో టికెట్లు ముందే ప్రకటించాలని కోరాను. మేమంతా కలిసిపోయాం.. ఎలాంటి విభేదాలు లేవని సోనియాకు చెప్పాను. రాహుల్ గాంధీతో పాటు మీరు కూడా తెలంగాణకు ఎక్కువ సమయం ఇవ్వాలని ప్రియాంకను కోరాను. తెలంగాణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ప్రియాంక చెప్పారు. ఒకరి పాదయాత్రకు మరొకరం సహకరిస్తామని సోనియాకు చెప్పాను. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెడతామని సోనియా చెప్పినట్టు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ నేతలపై ఐటీ దాడులు.. ఎల్బీనగర్‌లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో..
Comments
Please login to add a commentAdd a comment