![Komatireddy Venkat Reddy Reacts Revanth Reddy Brand Comments - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/3/venkat-reddy_0.jpg.webp?itok=E-bQBLpS)
సాక్షి,ఢిల్లీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై తొలిసారి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అయితే.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై తాను ఏం మాట్లాడనని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు. పనిలో పనిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన ‘కోమటిరెడ్డి బ్రాండ్’ కామెంట్లపైనా ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై నో కామెంట్స్. ఆయన తన ఇష్టమున్న పార్టీలోకి వెళ్తారు. ఏది ఉన్నా రాజగోపాల్‌రెడ్డినే అడగండి. చాలా కుటుంబాల్లో వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారనే విషయం గుర్తించాలి. రాజగోపాల్ వ్యవహారంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం తనతో ఎలాంటి చర్చలు జరపలేదు అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ మారతారా? అనే ప్రశ్నకు.. తాను మాత్రం కరడుగట్టిన కాంగ్రెస్ వాదినేనని.. ఉమ్మడి కుటుంబంగా పార్టీ ఆదేశాలానుసారం పని చేస్తానని చెప్పారు.
రేవంత్‌పై ఫైర్
‘‘కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే..
పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు అని సంభోదించడం ఏంటి? కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్ తప్పుగా మాట్లాడారు. మేం చాలా నిజాయితీగా ఉన్నాం. మమ్మల్ని అవమానించాలని చూస్తున్నారా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్‌రెడ్డికి చురకలంటించారు. బ్రాందీషాపులు పెట్టుకునేవాళ్లమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని రేవంత్‌రెడ్డి కామెంట్లను తప్పుబట్టారు.
‘మీరు..’ అని రేవంత్‌రెడ్డిగారు వాగడం బాధించింది. ఆయన మాపై దారుణంగా మాట్లాడారు. నేను పార్టీలో పని చేసే టైంకి ఆయనసలు పుట్టలేదు. 34 ఏళ్లు కాంగ్రెస్ కోసం నా రక్తం ధార పోశా. రేవంత్‌గారూ అనవసరంగా నన్ను రెచ్చగొట్టవద్దు. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అయితే చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తానని, అలాగని అధిష్టానానికి ఫిర్యాదు చేయబోనని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారా?. ఇద్దరు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాలో నేను తప్ప ఎవరూ పాల్గొనలేదు. అసలు పీసీసీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఫలితం ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు.. నో కామెంట్స్ అని సమాధానం ఇచ్చారాయ.
Comments
Please login to add a commentAdd a comment