సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మాణిక్‌రావు థాక్రే ప్లాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ నేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో మాణిక్‌రావుతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్ల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం సమావేశమయ్యారు.
కాగా, వీరి భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏఐసీసీ షోకాజ్ నోటీసులు చెత్త బుట్టలో పడ్డాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరిగింది. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదు సార్లు ఓడిపోయిన వారితో నేను కూర్చోవాలా?. మా ఫొటోలను మార్ఫింగ్ చేస్తే ఏఐసీసీ పట్టించుకోలేదు. నా ఫొటో మార్ఫింగ్ చేశారని స్వయానా సీపీనే చెప్పారు. బిజీగా ఉండటం వల్లే బుధవారం గాంధీభవన్‌కు రాలేదు. మరి.. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు రాలేదు. వాళ్లు రాలేదని ఎందుకు అడగరు?. నియోజకవర్గంలో పనుల కారణంగా బుధవారం థాక్రేను కలవలేకపోయాను’ అని స్పష్టం చేశారు.
ఇక, వీరి మధ్య గంటకు పైగానే చర్చ సాగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారంపై చర్చించినట్టు సమాచారం. వైఎస్ షర్మిల, టీడీపీ అధినేత చంద్రబాబు అంశాలపై కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి.. కాంగ్రెస్ నేతలు కేవలం వైఎస్ షర్మిలపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఎందుకు విమర్శించడంలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment