నరకంలో నాలుగేళ్లు ..అంటూ తెలుగుదేశం అనుకూల దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది. అది చదివితే అర్ధం అయిందేమిటంటే.. ఆ మీడియావారి కడుపు మంట, ద్వేషం,కుళ్లు ఆ స్థాయిలో ఉందని!. ఏ ప్రభుత్వానికి అయినా నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం ఒక సందర్భం. మీడియాగా ఆ ప్రభుత్వ మంచి చెడులు విశ్లేషించవచ్చు. అలాకాకుండా పూర్తిగా ఏకపక్షంగా, పచ్చి పాపంగా కథనాలను ఇస్తే ప్రజలు విశ్వసిస్తారా?. నిజంగా ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉన్నది?. ఇది పేదల, దిగువ మధ్య తరగతి ప్రజలకు స్వర్గసమానంగా ఉండడం ఆ పార్టీ పత్రికకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు.
గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు నరకం చూపించేవారు. లంచాలు ఇచ్చి, పదిసార్లు ఆ కమిటీల సభ్యుల చుట్టూ తిరిగినా పని జరుగుతుందో లేదో తెలిసేదికాదు. అది కదా నరకం అంటే!. మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చి ప్రజల అవసరాలను వారి ఇళ్ల వద్దే తీర్చుతోంది. దీనిని కదా స్వర్గం అనాల్సింది. అప్పట్లో వృద్దులు వారికి వచ్చే కొద్దిపాటి పెన్షన్ కోసం MRO ఆఫీస్ ల చుట్టూ తిరిగి వేసారిపోయేవారు. నిజంగానే వారు నరకం చూసేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన తెల్లవారకముందే వృద్దులకు పెన్షన్ లు ఇస్తున్నారు. ఇది కదా స్వర్గం అంటే. అలా పెన్షన్ లు అందుకున్న వృద్దుల కళ్లలో ఆనందం చూస్తే తెలుస్తుంది ఆ పత్రికవారికి అది స్వర్గమన్న సంగతి. ఎక్కడో కళ్లుమూసుకుని కూర్చుని పిచ్చి రాతలు రాస్తే సరిపోతుందా?.
✍️ గతంలో రేషన్ కోసం షాపుల వద్ద క్యూలు కట్టాల్సి వచ్చేది. మరి ప్రస్తుతం రేషన్ బండే ప్రజల ముంగిటకు వస్తోంది. ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లాలంటే నరకమే!. పారిశుద్ద్యం లేక, సరైన అజమాయిషీ లేక స్కూళ్లు కునారిల్లేవి. అలాంటిది జగన్ ప్రభుత్వం రాగానే వాటిని స్వర్గం మాదిరి మార్చే యత్నం చేసింది. ఒక్కసారి ఆ స్కూళ్లకు వెళితే.. ఇంత మార్పా? చక్కని భవనాలు, ఫాన్ లు, చివరికి ఫైవ్ స్టార్ రేంజ్‌లో టాయిలెట్లు వచ్చాయి.
ఆ సంగతిని కప్పిపుచ్చాలని ఆంధ్రజ్యోతి కుట్ర అన్నమాట. ఈ స్కూళ్లలో చదివే విద్యార్ధులకు ఆంగ్ల మీడియం బోధించినా ఈ మీడియాకు నచ్చదు. చంద్రబాబు పాలనలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ అరకొరగా ఉన్నా అది ఆ పత్రికకు స్వర్గం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నా నరకమే!!. అమ్మ ఒడి కింద ఏటా పదిహేను వేలు ఇవ్వడం, విద్యార్దులకు మంచి ఆహారం, విద్యా దీవెన ఇలా పలు రకాల స్కీముల గురించి ఒక్క మాట రాయడానికి చేతులురాని ఆ మీడియాకు ఇదంతా నరకంగా కనిపించిందట. ఒక ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి.. పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ రాంకర్ అవడాన్ని బట్టి ఇది స్వర్గమో కాదో నిర్ణయించుకోవచ్చు.
✍️ ఆరోగ్యరంగాన్ని తీసుకుంటే ఆస్పత్రులను నాడు-నేడు కింద బాగు చేస్తుంటే అది నరకమట. గతంలో అసలు ఈ రంగాన్ని పట్టించుకోకుండా వదలివేస్తే అది స్వర్గమట!. ఆరోగ్యశ్రీ కింద పేదలు, మధ్యతరగతి , ఆ మాటకు వస్తే ధనిక వర్గాలు సైతం లబ్ది పొందుతుంటే అది నరకమట!. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రం లో అయినా విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలే గొప్పవన్న విషయం ఆ పత్రికవారికి అర్దం కాకపోయినా, ప్రజలకు బాగానే అర్దం అవుతోంది.
✍️ ఒకప్పుడు రైతులు తమ కు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితరాల కోసం రోడ్డెక్కవలసి వచ్చేది. ఈ నాలుగేళ్లలో ఎక్కడైనా అలా జరిగిందా? రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధులను ఇస్తుంటే అది స్వరం అవుతుందా? నరకం అవుతుందా? అన్నిటికి మించి చంద్రబాబు పాలనలో ఏటా కరువుతో నరకాన్ని ప్రజలు చవి చూడవలసి వచ్చింది. అదృష్టవశాత్తు జగన్ పాలన ఆరంభమయ్యాక ఈ నాలుగేళ్లలో కరువు అన్న మాటే వినిపించలేదు. ఇదే రైతులకు పెద్ద స్వర్గం .
✍️ 31 లక్షల స్థలాలు పేదలకు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే.. అది నచ్చని వీరు నరకం అంటూ చెడరాస్తున్నారనుకోవాలి. పేదవాడికి ఆ సెంటు భూమి కూడా స్వర్గం కిందే లెక్క. అందుకే జగన్ ప్రభుత్వాన్ని వారు అంతగా సొంతం చేసుకుంటున్నారు. బలహీనవర్గాల మహిళలకు చేయూత కింద రూ.18,500, కాపు నేస్తం ,చేనేత నేస్తం, వాహన మిత్ర ఇలా పలు విధాలుగా ఆర్దిక సాయం చేస్తుంటే వారికి అది స్వర్గం అవుతుందికాని నరకం ఎలా అవుతుంది?. వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల గడప వద్దకు పాలన చేర్చడం స్వర్గం అవుతుందా?నరకం అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలకు ఇది నరకంగానే ఉంటుంది. ఎందుకంటే వారి పైరవీలకు, రియల్ దందాలకు, అరాచకాలకు అవకాశం ఇవ్వడం లేదు కదా? ప్రభుత్వం తమ చేతిలో ఉంటే తమకు ఏది కావాలనుకుంటే అది చేసుకునే వీలు ఉంటుందని వారి భావన. అది పోయిందన్నది వారి ఆక్రోశం. అందువల్ల వారికి ఇది నరకమే.
✍️ పరిశ్రమలు, అభివృద్ది గురించి చేతికొచ్చినట్లు రాశారు. రిలయన్స్ అంబానీ , అదాని తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు విశాఖ వచ్చి జగన్ కు అండగా నిలబడడాన్ని వీరు చూడలేక కళ్లలో నిప్పులు పోసుకున్నారు. అందువల్ల ఆ మంటతో వారికి నరకంగా కనిపిస్తుంది. కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు, పలాస వద్ద కిడ్నీ పరిశోధన కేంద్రం, నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు ఇలా అనేక రకాలగా నిర్మాణాత్మక పనులు జరుగుతుంటే అదంతా వారికి విధ్వంసగానే కనిపిస్తుంది. జగన్ తీసుకువచ్చిన స్కీములవల్ల రాష్ట్రం నాశనం అయిందని ఈ మీడియా ప్రచారం చేస్తుంటుంది. అదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంతకన్నా నాలుగైదు రెట్ల సంక్షేమ స్కీములను హామీ ఇస్తే అబ్బో అదిరిందని , వైఎస్సార్‌సీపీ వాళ్లు బిత్తరపోయారని చెత్త రాతలు రాస్తున్నారు.
✍️ ఇప్పుడు ఒక నరకం అనిరాస్తే.. చంద్రబాబు వస్తే నాలుగైదు నరకాలు చూపిస్తారని రాయాలి కదా! అలా కాదట. అవి బాణాలట. వైసిపి ప్రభుత్వంపై ఎక్కుపెట్టారట. అదిరిపోతుందని ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మరో టిడిపి పత్రిక ఈనాడు ఆర్దిక అరాచతక్వం అంటూ మరోసారి తన ద్వేషాన్ని వెళ్లకక్కింది.ఎపి అప్పుల పాలవుతోందట. చంద్రబాబు టైమ్ లో తీసుకు వచ్చిన అప్పుల గురించి చెప్పరు. జగన్ ఈ స్కీములు అమలు చేయడం అరాచకం అయితే , చంద్రబాబు వస్తే మరిన్ని స్కీములు ఇస్తానంటున్నారు కదా? అప్పుడు ఇంకెంత అరాచకం అవుతుంది?దానిపై ఎందుకు సంపాదకీయం రాయరు. కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఈ మీడియా సంస్థలు జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నాయి. ఈ ఏడాది అంతా వీరి కుట్రలను జగన్ ఎదుర్కోక తప్పదు కదా!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment