Kommineni Comments On Eenadu Hatred Stories On CM YS Jagan - Sakshi
Sakshi News home page

‘ఏపీ, తెలంగాణ.. అంతటా జగన్‌పై విద్వేషమే!’.. మరి ఆ కామెంట్ల సంగతేంటి?

Published Wed, Jul 26 2023 10:07 AM | Last Updated on Wed, Jul 26 2023 11:24 AM

Kommineni Comment On Eenadu Hatred Stories on Cm Jagan - Sakshi

తెలుగుదేశంను భుజాన వేసుకున్న ఈనాడు మీడియా ఎలాగైనా ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పడరాని పాట్లు పడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేజీల కొద్ది వార్తలను తన పత్రికలోను, గంటల కొద్ది వార్తలను తన టీవీలోను ఇస్తూ జర్నలిజం విలువలను మంటకలుపుతూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోంది. ప్రజలలో జగన్‌కు ఉన్న అనుకూలతను తగ్గించాలన్న తాపత్రయంలో అబద్దాలను ప్రచారం చేస్తూ  తాను నగ్నంగా తిరుగుతున్నానన్న సంగతిని ఆ మీడియా యజమాని రామోజీరావు మర్చిపోతున్నారు. తామే ప్రధాన ప్రతిపక్షం అనుకుని ఇష్టారీతిన కధనాలు నింపుతున్నారు.  

ఇది ఇవాళ ఒక్కరోజుది కాదు.. గత నాలుగేళ్లుగా సాగిస్తున్న దందా. కానీ, ఈ మధ్య అది మరింతగా పెరిగిపోయింది. పిచ్చి పతాక స్థాయికి చేరిందన్నట్లుగా నానా చెత్త అంతటిని పోగు చేసి ప్రజలపై కక్కుతున్నారు. ఆ విషపు రాతలను జనం నమ్ముతారా? లేదా? అనే సంబంధం లేకుండా పచ్చి పాపంగా దీనిని సాగిస్తున్నారు. జూలై 20వ తేదీ ఈనాడు పత్రికను పరిశీలిస్తే.. ఆ పత్రికలో రాష్ట్ర ,జాతీయ స్థాయి వార్తలు ఇవ్వడానికి ఆరు పేజీలు కేటాయిస్తే, అందులో ఏపీ  ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు అరపేజీలో కూడా లేవు. అదే టైమ్ లో  నాలుగు పేజీలకు పైగానే జగన్ ప్రభుత్వంపై బురదచల్లే వార్తలతో నింపేశారు. వాటిని జాగ్రత్తగా చదివితే అవన్ని చాలావరకు తప్పుడు రాతలేనని తేలిపోతుంది.

✍️ ఉదాహరణకు ఇసుక మీద ఒక ఫుల్ పేజీ వార్త రాశారు. నిజానికి అంతకుముందు రోజు కూడా ఒక పేజీడు వార్తను ఇసుక అక్రమ తవ్వకాలు అంటూ రాశారు. దానిపై సాక్షి లో ప్యాక్ట్ చెక్ పేరుతో వార్త వస్తుందని తెలుసు కాబట్టి,మళ్లీ మరుసటి రోజు కూడా ఇలా కథనాలు వండి వార్చారన్నమాట. ఒక్కసారి గతాన్ని గుర్తుకు చేసుకోండి. ఇసుకకు సంబంధించి టీడీపీ  హయాంలో జరిగిన అరాచకం, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ముఠాలను ఏర్పాటు చేసి ఇసుక దందా సాగించిన రోజుల్లో నూటికి,కోటికి ఒకటో,అరో వార్త రాసి సరిపెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ దందాను తీసేసి, ఒక సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నించగానే.. ఇంకేముంది ఇసుక తవ్వకాలు ఆపేశారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి అని ప్రచారం చేశారు. ప్రభుత్వం ఒక విధానం ఏర్పాటు చేశాక దానికి వ్యతిరేకంగా వార్తలు ఇచ్చారు. అసలు రాష్ట్రంలో అభివృద్దే ఆగిపోయిందని అన్నారు.

ఇటీవలికాలంలో ఏమి రాశారు. ఇసుకను  అక్రమంగా తవ్వేస్తున్నారు.దానివల్ల పర్యావరణం దెబ్బతినిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు సి.ఎమ్.గా ఉన్నప్పుడు ఆయన కరకట్ట ఇంటికి సమీపంలోనే లారీలకు,లారీల ఇసుక తవ్వుతుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించింది. అయినా అప్పుడు ఇలా ఇన్ని పేజీల వార్తలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇసుకను స్టాక్ చేసుకుని ప్రజలకు సరఫరా చేస్తుంటే ,అది కూడా అక్రమంగా తవ్విందేనని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఎక్కడైనా ఒకటి,అర చోట అక్రమంగా తవ్వుతుంటే వార్తలు ఇవ్వడం వేరు. ఉన్నవి,లేనివి కలిపి నానా చెత్తంతా రాస్తే,చివరికి ప్రజలు వాటిని నమ్మని పరిస్థితిని ఈనాడు తెచ్చుకుంది.

✍️ అసలు వీరి ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేయడమే. తద్వారా ఇసుక కొరతను సృష్టించి, ప్రభుత్వం ఇసుక ఇవ్వలేకపోతోందని దుష్ప్రచారం సాగించాలన్నదే వారి కుట్ర. పోనీ ఇంకో కోణం చూద్దాం. రాష్ట్రంలో అభివృద్దే లేదని,అన్నీ ఆగిపోయాయని వీరే చెబుతారు. కాని ఇసుకను మాత్రం లక్షల టన్నులలో తోడేస్తున్నారని వీరే అంటారు. అంటే ఇంత ఇసుకను రాష్ట్రంలో వినియోగిస్తున్నట్లే కదా?అభివృద్ది జరుగుతున్నట్లే కదా!ఒకవేళ వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే ఇంకా గగ్గోలు పెట్టేవారు కదా! గత ప్రభుత్వ హయాంలో పేరుకు ఉచితం కాని ప్రజల జేబులకు బాగానే చిల్లు పడేది. నాయకుల జేబులు మాత్రం ఫుల్ అయ్యేవి. ఇప్పుడు దానిని అరికట్టి ప్రభుత్వానికి ఏటా రూ. 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చేసినందుకు అభినందించవలసింది పోయి,అక్రమ ఇసుక తవ్వకాలు, కోర్టు ఆదేశించినా ఇసుక తవ్వుతున్నారు అంటూ తప్పుడు వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి వార్తలు ఇచ్చినా పేజీలకు,పేజీలు ఇవ్వడం ఇటీవలికాలంలోనే చూస్తున్నాం. అదే తెలంగాణలో జరుగుతున్న ఇసుక తవ్వకాల గురించి ఈనాడు మీడియాకు దమ్ముంటే రాయమనండి చూద్దాం. అక్కడ మాత్రం రామోజీ ఎందుకు వణుకుతారో అందరికి తెలుసు.

✍️ మరికొన్ని వార్తలు చూద్దాం. మెడికల్ కాలేజీలలో బి,సి కేటగిరిల సీట్లను అధిక ఫీజులకు ఎన్.ఆర్.ఐలకు, ఇతరులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వైద్య విద్యలో నాణ్యత పెంచాలన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వంలో డబ్బు లేక కాలేజీలు పెట్టినా అవి సరిగా నడవని పరిస్థితులు ఏర్పడరాదన్నది సంకల్పం.కాని ఈనాడు ఈ వార్తను ఎలా చిత్రీకరించి వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారంటూ జగన్ పై విషం కక్కింది. నిజంగానే ఈనాడుకు ఈ విధానాల మీద నమ్మకం లేకపోతే గతంలో జరిగిన వాటి గురించి,ఆయా రాష్ట్రాలలో ఉన్న పద్దతుల గురించి రాయాలి కదా!  

అసలు మెడికల్ కాలేజీలలో ఎన్.ఆర్.ఐ కోటాను సృష్టించింది. డోనేషన్ సీట్లను కేటాయించడంం మొదలు పెట్టింది తెలుగుదేశం హయాంలోనే. ఎన్.టి.ఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య యూనివర్శిటీ నుంచి  ఈ సిస్టమ్ అమలు చేయడం ఆరంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఆయన కాబట్టి విజన్ తో అలా చేశారని రాశారు. అదే అంతకుముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డగి ప్రభుత్వం ప్రైవేటు రంగంలో వైద్య ,ఇంజనీరింగ్ కాలేజీలను ఇస్తే ఇదే టిడిపి విద్యను అమ్ముతారా అంటూ కోర్టుకు వెళ్లింది. చంద్రబాబు టైమ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో మేనేజ్ మెంట్ కోటాను పెట్టి అధిక ఫీజులను వసూలు చేస్తున్నప్పుడు ఈనాడుకు అది వ్యాపారంగా కనిపించలేదు. ఇలాంటి వార్తలు ఇవ్వదలిస్తే ఏ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది రాస్తూ విశ్లేషించాలి.అలాకాకుండా జగన్ ప్రభుత్వమే ఇలా మొలు పెట్టిందన్నట్లుగా ప్రజలలో అపోహ సృష్టించడానికి ఈనాడు పాట్లు పడింది.

✍️ తెలుగు భాష కు సంబంధించి హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తే ,అదేదో ఈ ప్రభుత్వ టైమ్ లోనే జరుగుతుందేమోనన్న అనుమానం కలిగించడం కోసం మొదటి పేజీలో అంత ప్రముఖంగా వార్తను ఇచ్చారు.ఏకంగా సంపాదకీయాన్నే ఇచ్చి కన్నీళ్లు కూడా పెట్టేశారు. ఇంత తెలుగుమీద ప్రేమ ఉన్నవారు తమ  సొంత స్కూల్ లో ఆంగ్ల మీడియం నే ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. బూ ఆక్రమణ అభియోగంతో  వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి సంబంధించిన సంస్థలు ఆక్రమించాయని ఎవరో హైకోర్టులో కేసు వేశారు. దానిని వార్తగా ఇవ్వవచ్చు. దానికి పెట్టిన హెడింగ్ చూడండి..175 ఎకరాల భూ ఆక్రమణ అంటూ పెద్ద హెడింగ్ పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేశారు. వీరే తీర్పు ఇచ్చేసిన చందంగా రాశారు. 

✍️ ‘‘మా భూమిని అమ్మేశారు..’’ అంటూ వైఎస్సార్‌సీపీ వాళ్లపై ఆరోపిస్తూ ఇంకో వార్త.. ఏ గ్రామంలో చిన్న ఘటన జరిగినా,దానిని వైసిపికి పులిమి రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయడమే పనిగా ఈనాడు మీడియా పెట్టుకుంది.లోకేష్ పాదయాత్రలో ఆయన మాట్లాడిన విషయాలకు తప్పనిసరిగా ప్రధాన్యత ఇచ్చి ఆయనను పెద్ద నాయకుడిగా చేయడానికి ఈనాడు,తదితర ఎల్లో మీడియా పనిచేస్తోంది.ఆయనకాని, మరెవరైనా ఇతర పార్టీల నేతలు కాని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాటిని భారీగా ప్రచురిస్తారు. బిజెపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అవినీతి, అంధకార,అప్పుల ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానిస్తే మొదటి పేజీతో పాటు చివరి పేజీలో కూడా వార్తను ఇచ్చారు. అదే ఆమె టీడీపీని విమర్శించి ఉంటే దాని జోలికి పోరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటిఆర్, హరీష్ రావు వంటివారు ఎపికి వ్యతిరేకంగా ,వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రకటనలు చేస్తే ఏపీ  ఎడిషన్ లోకూడా భారీగా ప్రచురించే వీరు. అదే టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి అంటే మాత్రం ఒక్క ముక్క రాయరు. ఉదాహరణకు కెటిఆర్, హరీష్ రావులు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు  కాంగ్రెస్ అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్ అని, వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, వ్యవసాయానికి విద్యుత్ అక్కర్లేదని రేవంత్ అంటున్నారని విమర్శిస్తే, ఆ వార్తను తెలంగాణ ఎడిషన్ లోనే  కనీ,కనిపించకుండా ఇచ్చారు. ఏపీలోకి వచ్చేసరికి అసలు కనిపించలేదు. ఇంత పక్షపాతంగా వార్తలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగానే ఎల్లో మీడియా యత్నిస్తోంది.

✍️ ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, టివి 5వంటివి సరేసరి. ఇంత దారుణంగా ఈనాడు మీడియా తయారైనా,దీనిని ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోగులుగుతున్నారంటే అది ఆయన ధైర్యం. అది ఆయన సత్తా. వీరందరికి దుష్టచతుష్టయం అని ఆయన పేరు పెట్టి ప్రజలలోకి వెళుతున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ ఎల్లో మీడియా చేస్తున్న దుర్మార్గపు అబద్ధాల వార్తల ప్రచారానికి ఎప్పుడో దెబ్బతినిపోయేవారు. ఏది ఏమైనా ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా, ఇతరత్రా వాస్తవాలు చాలావరకు తెలుసుకుంటున్నారు. అందుకే ఈ ఎల్లో మీడియా పప్పులుడకడం లేదు.


::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement