మనిషికి , మనిషికి కొలమానాలు ఎలా మారిపోతాయో చూడండి. వివేకా కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏడుసార్లు విచారించినా.. మళ్లీ ,మళ్లీ విచారణ చేయాలనడం కరెక్టట!. అదే మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తే మాత్రం తప్పట!. ఏమి లాజిక్!.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ. దాని జోలికి వెళ్లకుండా.. సీబీఐ వాళ్లు అలా చేశారు... ఇలా చేశారు.. అవినాశ్.. దానికి సమాధానం చెప్పలేదు.. దీనికి చెప్పలేదు అంటూ ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. చివరికి ఎంతవరకు వెళ్లారంటే అవినాష్‌కు బెయిల్ ఇవ్వకుండా చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో మీడియాలోని ఒక వర్గం ఏకంగా న్యాయ వ్యవస్థకే కళంకం ఆపాదిస్తూ చర్చలు జరిపింది.
✍️ అవినాష్ రెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారిస్తున్న తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కోణంలోనే విచారణ సాగుతోందని, రెండో కోణంలో దర్యాప్తు జరగడం లేదన్న అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో.. గౌరవ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సిబిఐ నీళ్లు నమిలింది. కాగా, మార్గదర్శి ఆర్దిక లావాదేవీల అక్రమాల కేసులో ఆ సంస్థ ఎండీ అయినా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారిస్తుంటే.. అది కక్ష అని ప్రచారం చేస్తున్నారు. తమ చేతిలో మీడియా ఉంది కనుక సీఐడీపై ఆరోపణలు గుప్పించారు. అదే మరోచిట్ ఫండ్ సంస్థ కాని, ఇంకో ఆర్థిక సంస్థ కాని ఇలా కేసులో చిక్కుకుంటే, ఆ కంపెనీ ఎండీని, డైరెక్టర్‌లను సీఐడీ విచారిస్తుంటే ఇదే ఈనాడు మీడియా ఎన్ని రకాల కథనాలు వండి వార్చేది?.
✍️ కొన్నేళ్ల క్రితం అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసును తీసుకుంటే ఈనాడు మీడియా ఎన్ని వార్తలు ఇచ్చి ఉంటుంది!. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబులు కలిసి కేసులు పెట్టినప్పుడు సీబీఐ విచారణ సందర్భంలో ఎంత ఘోరంగా ఈనాడు మీడియా వార్తలు ఇచ్చింది గుర్తు లేదా!. జగన్ పై కేసు నిలబడుతుందా?లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా, ఏకపక్షంగా.. సీబీఐ అధికారి ఇచ్చిన లీకులు, తమకు ఏది తెలిస్తే దానిని మొదటి పేజీలలో పుంజీలకొద్ది కథనాలు ఇచ్చారే!. ఏకంగా జగన్ పై ఈడీ కేసులు వచ్చాయని, తీహారు జైలుకు తరలిస్తారని పలుమార్లు వార్తలు ఇచ్చారే! అప్పుడు సీబీఐ వాళ్లకు గొప్పసంస్థగా కనిపించింది. ఆ దర్యాప్తు సంస్థ అధికారిని గొప్ప ఆఫీసర్‌గానూ పబ్లిసిటీ చేశారు. తీరా ఆ అధికారి ఆ తర్వాత కాలంలో ఒక రాజకీయ పార్టీలో చేరి ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందారు. అంతగా ఆ మీడియా ఆయనను ప్రభావితం చేసిందన్నమాట.
✍️ ఇప్పుడు మార్గదర్శి కేసులో ఏమి రాస్తున్నారు?.. ఏమి చెబుతున్నారు?.. మార్గదర్శిని దెబ్బ తీయడమే అసలు లక్ష్యం అని హెడ్డింగ్‌లు పెడుతున్నారు. ఏడు గంటల పాటు ఎండీ శైలజా కిరణ్‌ను విచారించిన సీఐడీ, మళ్లీమళ్లీ అవే ప్రశ్నలు. పొంతనలేని అంశాలు అంటూ ఈనాడు వార్త ఇచ్చింది. మరి సీబీఐ అవినాష్‌ను కాని, ఆయా కేసులలో కాని పలుమార్లు విచారించినప్పుడు ఇలా ఎందుకు రాయదు!. సీబీఐ వేసిన ప్రశ్నలు వేయడం కాకుండా కొత్త ప్రశ్నలు వేసిందని ఈనాడు కనిపెట్టిందా!. ఏ దర్యాప్తుఅధికారి అయినా, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పదే,పదే ఒకే ప్రశ్న అడుగుతుంటారట. తద్వారా ఏదో టైమ్ లో భిన్నమైన సమాచారం వస్తుందేమోనని పరిశీలిస్తుంటారట. వేధింపులే లక్ష్యంగా అధికారులు వ్యవహరించారని ఈనాడు ఆరోపణ.
✍️ సాధారణంగా నిందితులు పోలీస్ స్టేషన్ లేదా, నిర్దిష్ట పోలీసు కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరు కావల్సి ఉంటుంది. కాని ఇక్కడ ఏపీ సీఐడీ రామోజీరావును కాని, ఆయన కోడలు శైలజా కిరణ్ ను కాని వారి ఇంటికే వళ్లి విచారిస్తున్నారే!. దేశంలో ఎంత మందికి ఇలాంటి గౌరవం లభిస్తుంది. అయినా వేధింపులే అని వీరు వాపోతున్నారు. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించారని అంటున్నారు. అవేమిటో చెప్పలేదు. అవినాష్ కేసు అయినా, మరోకేసు అయినా, దర్యాప్తు సంస్థ వేసిన ప్రశ్నలు, వీరు ఇచ్చిన జవాబులు అంటూ వార్తలు ఇచ్చే మీడియా శైలజా కిరణ్ విషయంలో అలా ఎందుకు చేయలేదు?. ఏ ప్రశ్నకు ఆమె ఏ సమాధానం ఇచ్చారో రాసి ఉంటే వాస్తవాలు తెలిసేవి కదా!.
✍️ గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వంపై విపరీతమైన దాడి చేస్తూ , నిత్యం తప్పుడు వార్తలతో నింపుతున్న ఈనాడు మీడియాకు తమదాకా వచ్చేసరికి అమ్మో,అబ్బో అంటున్నారే. సీఐడీ వారు మార్గదర్శిలో ఫలానా అక్రమాలు జరిగాయని అంటున్నారు. వందల కోట్లో, వేల కోట్లో బ్లాక్ మనీ సర్కులేట్ అయిందని చెబుతున్నారు. వాటికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. వాటిని శైలజా కిరణ్ కు కూడా చూపించి ప్రశ్నిస్తే, ఆమె వాటికి జవాబు ఇవ్వలేకపోయారని వేరే మీడియాలో వార్తలు వచ్చాయే!. డిపాజిట్ దారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారా?లేదా? అన్నదానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వవచ్చు కదా?. అన్నిటికి మించి CID వారు మార్గదర్శి ఆఫీస్ లలో సోదాలు జరిపినప్పుడు వారు అడిగిన రికార్డులు అన్నింటినీ ఇచ్చేసి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు కదా!.
✍️ ఏపీలో జరిగిన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. మార్గదర్శి నిధులను మళ్లించిన విషయాన్ని ఒప్పుకున్నారు. కాని, ఎక్కడికో తెలియదని ఆమె అన్నారట. ఆ డబ్బును షేర్లలో పెట్టారా?లేదా? అందుకు చట్టం అనుమతిస్తుందా? అలాగే ఆ నిధులను రామోజీ గ్రూపు ఇతర సంస్థలలో పెట్టారా?లేదా? అది చెల్లుతుందా? నల్లధనం మార్పిడికి మార్గదర్శిని వాడుకున్నారన్న అభియోగానికి ఏమి సమాధానం ఇచ్చారు?. ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదన తప్ప, చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా అనేవాటికి జవాబు ఇవ్వడం లేదు. విచారణకు శైలజ సహకరించలేదని అధికారులు అంటున్నారు. అయితే ఒక అధికారి సహకరించారని అన్నారని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. నిజంగానే శైలజా సహకరించి ఉంటే మంచిది!. సీఐడీకి కాని, ఇతరత్రా సాధారణ ప్రజలకు కాని వస్తున్న సందేహాలను తీర్చే విధంగా తమ మీడియాలో ప్రముఖంగా ఇస్తే అంతా తేలిపోతుంది కదా!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
ఇదీ చదవండి: ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment