మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు | Kommineni Comment On Konda Surekha Comments | Sakshi
Sakshi News home page

మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు

Published Fri, Oct 4 2024 10:30 AM | Last Updated on Fri, Oct 4 2024 11:33 AM

Kommineni Comment On Konda Surekha Comments

‘‘ఒక మహిళా మంత్రి దుష్టశక్తిగా మారి తప్పుడు ఆరోపణలు చేస్తారా? రాజకీయ ప్రయోజనాలకోసం పరువు ప్రతిష్టలతో బతుకుతున్న పౌరులపై బురద చల్లుతారా? సభ్యత లేని వారెవరో నా భర్తపై మీకు పచ్చి అబద్ధాలు చెబితే ఆవగింజంత వాస్తవం లేకపోయినా ఆరోపణలు చేస్తారా? ఇది నిజంగా సిగ్గు చేటైన విషయం’’ - ఇదీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అమల ఆవేదనతో చేసిన వ్యాఖ్య. నాగార్జునపైన పిచ్చి ఆరోపణలు , కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని  మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై అమల ఘాటుగా స్పందించారు.

అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ విషయంలో కొండా సురేఖ తీరును ఖండించిన ప్రకటనలు ఎలా వున్నా.. అమల ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆమె కొండా సురేఖ వైనాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి ఎక్కడా వెనుకాడ లేదు. నాయకులు తమ స్థాయిని తామే తగ్గించుకొని క్రిమినల్స్‌ మాదిరి వ్యవహరిస్తే ఈ దేశం ఏమైపోతుంది అంటూ అమల ఆవేశంగా ప్రశ్నించారు. మీ రాజకీయాల కోసం బలి చేస్తారా అని అమల అన్నారు.  ఆమె ఏఐసిసి నేత రాహుల్‌ గాంధీకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ప్రజల గౌరవ మర్యాదలపై ఏమాత్రం నమ్మకమున్నా ఇలాంటి నేతలను నియంత్రించాలని, దేశ పౌరులను రక్షించాలని కోరారు.

అమల ఆవేదనలో నిజంగానే అర్థముంది. భర్త నాగార్జునను టార్గెట్ చేశారన్న బాధ కనిపించింది. ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అనండి, లేక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అనండి, అవసరం, అర్జెన్సీ లేక పోయినా నాగార్జున ఎన్ కన్వన్షన్ ను కూల్చి వేసింది. ఆ తర్వాత రేవంత్‌ ప్రభుత్వంలోని మంత్రి  కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియాలో విస్తారంగా రావడంతో అవన్ని నాగార్జున కుటుంబానికి తీవ్రమైన ఆవేదన మిగిల్చాయి. ఆ తర్వాత కొండా సురేఖ సారీ చెప్పి వివరణ ఇచ్చినా అదంత సంతృప్తికరంగా లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా దీనిపై వెంటనే స్పందించి ఉంటే బాగుండేది.అసలు స్పందించకపోవడం ఇంకా అధ్వాన్నం.

నాగార్జున తన ప్రకటనలో ప్రత్యర్థులను విమర్శించేందుకు, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని కోరారు. సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధమని స్పష్టం చేశారు. నాగచైతన్య తన ప్రకటనలో కేవలం మీడియాలో హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలపై మాట్లాడడం సిగ్గుచేటని, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. సమంతతో విడాకుల నిర్ణయం పూర్తిగా పరస్పర అవగాహనతో జరిగిందని తమకు వేరు, వేరు జీవిత లక్ష్యాలు ఉండడంవల్లే పరిపూర్ణత కలిగిన వ్యక్తులుగా తామిద్దరం గౌరవించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాగార్జున మరొక కుమారుడు అఖిల్‌ తన ప్రకటనలో తల్లి అమల చేసిన వ్యాఖ్యలో ప్రతి పదాన్ని సమర్థిస్తున్నట్టు తెలిపారు.

Is Samantha suffering from another serious health issue?

ఇక ఈ ఘటనలో బాధిత మహిళ అయిన ప్రముఖ నటి సమంత ఓ ప్రకటన చేస్తూ, విడాకులు తన వ్యక్తిగత విషయమని, సినీ పరిశ్రమలో ఉండడానికి, బైటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలని, సురేఖ ఆ విషయాన్ని గుర్తించాలని అన్నారు. దయచేసి చిన్నచూపు చూడవద్దని విజ్ఞప్తి చేశారు. తమ విడాకుల విషయంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని స్పష్టం చేశారు.అంటే దీనర్థం సమంతపై  కేవలం కొందరు ప్రచారం చేసే అసత్యపు గాసిప్స్‌నే మంత్రి వాడారని అర్థమవుతోంది. ఒకప్పుడు హిందూ నేషన్‌ అనే ఒక పత్రిక ఉండేది. అందులో సినిమావాళ్లకు సంబంధించిన పిచ్చి పిచ్చి గాసిప్స్‌ రాసేవారు. వాటిని జనం చదివి నవ్వుకొని వదిలేసేవారు. కొందరు తిట్టేవారు. అంతవరకే అవి పనికొచ్చేవి. కాలక్రమంలో సమాజం నుంచి నిరాదరణ రావడంతో ఆ పత్రిక నిలిచిపోయింది. ఇప్పుడు ఆ గాసిప్ప్ పత్రిక పాత్రను సురేఖవంటి రాజకీయ నేతలు తీసుకున్నట్టయింది.

నాగార్జున కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. వారిలో కొందరు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రకాష్‌ రాజ్‌  ''ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు ...సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా'' అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే సినీ పరిశ్రమలోని వారిపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోజాలమని అన్నారు. ఎలాంటి చెత్త మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయ నేతలు కొందరు భావిస్తున్నారని మరొక నటుడు నాని ధ్వజమెత్తారు.మెగాస్టర్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్ ,మహేశ్ బాబు తదితరులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి పదవిలో ఉండి నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని చిరంజీవి అన్నారు. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడినట్లు కనిపించలేదు.

ఒకవైపు హైడ్రా వ్యవహారంలో చికాకుపడుతున్న రేవంత్‌ ప్రభుత్వానికి కొండా సురేఖ కొత్త చిక్కులను తెచ్చిపెట్టారు. సురేఖ దీనిపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యల ఉద్దేశం, ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని, ఆమెపై అభిమానం ఉందని, ఆమె తనకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురయితే బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహించుకుంటున్నానని ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోపంతో సురేఖ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక ప్రతిష్ట కలిగిన కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చినట్టయింది. పైగా సమంత మనస్థాపానికి గురయితే.. అని ముక్తాయించి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాను అనడంలో కూడా కచ్చితంగా అధికార అహంకారం కనిపిస్తోంది. సురేఖ బేషరతుగా, బహిరంగంగా క్షమాపణలు కోరి ఉండాల్సింది. సినిమా వారికి, రాజకీయాల్లోని వారికి మధ్య సంబంధ, బాంధవ్యాలు ఉండడం ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో సినీ నటుల ప్రచారాన్ని నేతలు కోరుకుంటుంటారు. కొందరు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా రాణించారు.కాని ఒక  సినీమా స్టార్ పై ఈ రకమైన నీచవ్యాఖ్య చేయడం మాత్రం దారుణం.సినీ రంగంలో మహిళలు ఎన్నో కష్టనష్టాలకు, అపవాదులను ఓర్చుకునే పరిస్థితి సభ్య సమాజానికే అవమానం.  సురేఖ  అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ద్వారా ఆమె నాగార్జున కుటుంబానికి, సమంతకు తీరని నష్టం చేశారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగాశ్వరరావు గానీ, ఆయన కుమారుడు నాగార్జున గానీ ఎనలేని సేవలు అందించారు.

కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డిలాంటివారు అక్కినేనిని చాలా గౌరవించి ఆయన్ని హైదరాబాద్ కు రప్పించి సినీ పరిశ్రమ ఇక్కడకు రావడానికి  సహకారం తీసుకున్నారు. ఎన్టీఆర్ సమకాలీనుడైన నాగేశ్వరరావును రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు గౌరవిస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్ ల కు కూడా అక్కినేని కుటుంబంతో సత్ సంబంధాలున్నాయి. అక్కినేని కుటుంబం వారెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ కారణం ఏమో తెలయదు గానీ నాగార్జునను గురి పెట్టినట్టుగా ఇటీవలి కాలంలో రేవంత్ ప్రభుత్వంలోని వారు వ్యవహరిస్తున్నారు.

కొండా సురేఖ విషయానికి వస్తే ఆమె దుందుడుకుగా మాట్లాడడం కొత్త కాదు. ఆమె కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పార్టీల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. . వైఎస్ఆర్ టైమ్‌లో మంత్రిగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మంత్రి కాగలిగారు. గతంలో జగన్‌కు మద్దతిచ్చి రోశయ్య ప్రభుత్వంపై అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో వైఎస్సార్ సీపీకి దూరమై జగన్ పై అభ్యంతకరమైన రీతిలో మాట్లాడారు.  కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా ఆమె తీవ్రమైన భాషనే ప్రయోగించారు.

సినీ ప్రముఖుల జీవితాల సంగతి ఎలా ఉన్నా అనేక మంది రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించి కూడా ఎన్నో కల్పిత కథలు ప్రచారం అవుతుంటాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది నేతలు రాజకీయాలకు అర్హులే కాకుండా పోతారు. ఇక్కడ కొండా సురేఖ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లజాలం.ఆమెపై బీఆర్‌ఎస్‌ వారు గానీ, మరెవరో గానీ చేసిన  ట్రోలింగ్స్‌ను సమర్థించజాలం. బీజేపీ ఎంపీ రఘునందన్ ఆమెకు నూలు దండ వేస్తే దానిపై పిచ్చివాళ్లు కొందరు అభ్యంతరకర  పోస్టింగులు పెట్టారు. దానిపై కేటీఆర్ స్పందించిన తీరు కూడా  బాగాలేదు.

ఆమెను ఉద్దేశించి దొంగ ఏడుపులు అనడం పద్ధతిగా లేదు. తదుపరి సురేఖ మరింత జుగుప్సాకరంగా , మంత్రి హోదాను మర్చిపోయి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వాళ్ల రొంపిలోకి లాగడం ఏమాత్రం సభ్యత కాదు. కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేసుకోవచ్చుగానీ మధ్యలో నాగార్జున, నాగచైతన్య, సమంత  ఏం చేశారు? వారిని అన్యాయంగా సమాజంలో బలి చేయడం తప్ప, సాధించింది ఏముంది? నిజానికి ఇంత తీవ్రమైన హేయమైన  వ్యాఖ్యలు చేసిన సురేఖ మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హులవుతారా? కాదా? అనేది ఆలోచించుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్‌ ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని అనడం సులువే కానీ, అక్కినేని నాగార్జునకు జరిగిన డ్యామేజీని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పలేకపోయారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనంతకుమార్ హెగ్డే వివాదస్పద వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి కోల్పోయారు.

గతంలో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకే చెందిన అప్పటి మంత్రి  గోకా రామస్వామి రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి పదవి కోల్పోయారు. ప్రముఖ నటి జయప్రద యూపీలో కొందరు రాజకీయ నేతల వల్ల ఇబ్బంది పడ్డారు. నాగార్జున కుటుంబానికి ఆవేదన మిగిలి ఉండవచ్చు కాని, ఈ మొత్తం ఉదంతంలో కొండా సురేఖే సమాజం దృష్టిలో దోషిగా నిలబడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో  నాగార్జున  మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేయడం సముచితమే. సురేఖపై అభ్యంతర ట్రోలింగ్స్ చేయించారని కేటీఆర్‌, హరీష్ రావులపై కేసులు పెట్టారట. ఒకే. కానీ మరి  ఇలాంటి నీచమైన  వ్యాఖ్యలు చేసిన మంత్రి పై కేసులు ఎందుకు పెట్టలేదు?నాగార్జున మంత్రిపై కేసు పెట్టించడానికి ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో తెలియదు.

మహిళానేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో, ఒక మహిళా మంత్రి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే  తప్పుడు సంకేతాన్ని ఇచ్చినట్టవుతుంది. ఏపీలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ లో భాగంగా లడ్డూ రాజకీయాన్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ తెలంగాణలో హైడ్రాతో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి సురేఖ వంటివారు ఇలాంటి ప్రయత్నం చేస్తే  కాంగ్రెస్ కు, రేవంత్‌ కు ఎలాంటి ప్రయోజనం వుండకపోగా మరింత నష్టమన్న సంగతి తెలుసుకోవాలి. 

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement