ఈనాడు రామోజీరావు కూడా భయపడుతున్నట్లే ఉన్నారు. ఎందుకంటే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కుంభకోణానికి సంబంధించి సీఐడీ అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పైశాచికంగా, అరాచకంగా రాసిన సంపాదకీయం కింద ఆయన సంతకం కనిపించలేదు. సాధారణంగా మొదటి పేజీలో ఇలా ప్రత్యేకంగా రాసినప్పుడు ఛీప్ ఎడిటర్ హోదాలో సంతకం చేస్తుంటారు. దీనిని ఒక కథనంగా ఇచ్చారా?లేక వ్యాసంగా మొదటి పేజీలో ఇచ్చారా?లేక సంపాదకీయంగా రాశారా? అంటే చూడడానికి ఫ్రంట్ పేజీ ఎడిటోరియల్ మాదిరే కనిపిస్తుంది. కానీ రామోజీ సంతకం లేదు. దీంతో ఆయన భయపడుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ఆయన తరపున పనిచేసే సంపాదకులు ఎవరైనా సంతకం చేసి ఉండవచ్చు. అదీ చేయలేదు.
మరో విశేషం ఏమిటంటే అత్యంత ప్రముఖమైన ఘటన జరిగితేనే మాస్ట్ హెడ్ ను పక్కకు జరుపుతారు. చంద్రబాబు అరెస్టు వార్తకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. దానికి అరాచక అరెస్టు అని హెడింగ్ పెట్టారు తప్పితే, అసలు స్కామ్ ఏమిటో, ఎందుకు చంద్రబాబును అరెస్టు చేశారన్నదానిపై మొదటిపేజీలో వార్తనే ఇవ్వలేదు. ఇందులో ముఖ్యమంత్రి జగన్ పై విషం చిమ్మడం , చంద్రబాబు అత్యంత నిజాయితీపరుడు అని ప్రజలు అనుకోవాలన్న భావనతో రాయడం మినహా వేరే కనిపించలేదు. తమ విలేకరులతో రాయించిన పలు విషయాలనే మళ్లీ వాడుకుంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించి వికృతానందాన్ని ఈనాడు పొందినట్లు అనిపిస్తుంది.
✍️ అవినీతి ఎక్కడ ఉన్నా పోరాడాలని ఉపన్యాసాలు ఇచ్చిన రామోజీ ఇప్పుడు ఇలా దిగజారిపోవడం అర్దం అవుతూనే ఉంది. తానే స్వయంగా మార్గదర్శి స్కామ్ లో చిక్కుకుని విలవిలలాడుతుండడంతో.. ఇప్పుడు అవినీతికి మద్దతుగా చంద్రబాబు హయాంలో జరిగిన స్కామ్ లనే సమర్ధించే దుస్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు ఇదే రామోజీ తన పత్రికలో చంద్రబాబుపై కార్టూన్లు వేస్తూ పది, పరకకు లొంగుతారా అంటూ కామెంట్ చేసిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబుతో ఏర్పడిన అవగాహనతో ఆయన ఏమి చేసినా సమర్దించడానికి రామోజీ అలవాటు పడ్డారు.
నైపుణ్యాభివృద్ది సంస్థ స్కామ్ లో చంద్రబాబుకు పాత్ర లేదని ప్రచారం చేయడానికి ఆయన నడుం కట్టారు. ఇదే కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు అయిన విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టి నలుగురిని అరెస్టు చేసిన విషయాన్ని విస్మరిస్తున్నారు. చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్న వ్యక్తి అని ,అర్దరాత్రి వెళ్లి ఇబ్బంది పెడతారా అని రాసిన రామోజీకి, సీఐడీ పోలీసులు తెల్లవారిన తర్వాత 5.30 గంటల వరకు చంద్రబాబుకోసం వేచి ఉన్న విషయం తెలియదా?. మరి అంత వయసు ఉన్న వ్యక్తిని హెలికాప్టర్ సౌకర్యవంతంగా తీసుకువెళతామంటే ఆయన ఎందుకు ఒప్పుకోలేదో, రోడ్డు మార్గంలోనే వెళ్లాలని ఎందుకు పట్టుబట్టారో రామోజీ వివరించాలి కదా! అంటే మార్గ మధ్యంలో గొడవలు చేయించాలనే కదా!
✍️ చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న టైంలో.. ఆశించిన మేర టిడిపి కార్యకర్తలు ఎవరూ పెద్దగా రోడ్లపైకి రాకపోవడం ఈనాడుకు నిరాశ కలిగించి ఉండొచ్చు. అయినా ఏదో జరిగిపోయినట్లు పిక్చర్ ఇవ్వడానికి ఈనాడు నానా పాట్లు పడింది. కొంతకాలం క్రితం న్యాయమూర్తులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా సిబిఐ అరెస్టు చేసినవారిలో కూడా డెబ్బై ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఈనాడుకు అప్పుడు అలాంటివారి వయసు గుర్తుకు రాలేదు. తనకు గిట్టనివారిపై సీఐబీ ఏదైనా దర్యాప్తు చేస్తే ‘అబ్బో బ్రహ్మాండం.. అలా జరిగింది.. ఇలా జరిగింది’ అని ఊదరగొట్టిన ఈనాడుకు సీఐడీ దర్యాప్తు మాత్రం తప్పుగా కనిపిస్తుంది. సీబీఐని చంద్రబాబు ఎపికి రావద్దని ఆర్డర్ ఇస్తే వెంటనే రామోజీ కూడా సిబిఐ తోకను చంద్రబాబు కట్ చేస్తున్నట్లు కార్టూన్లు వేశారు. గతంలో జగన్ కేసులో సీబీఐ ఏ రకంగా కేసును టేకప్ చేసింది.. ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. అయినా ఆనాడు జగన్ ఎక్కడా ఏమి మాట్లాడలేదు. మరి చంద్రబాబు కేసులో సీఐడీ అనేక ఆధారాలు చూపిస్తున్నా రామోజీకి సరిపోవడం లేదు.
గతంలో జగన్ కుటుంబ సభ్యులంతా రాజ్ భవన్ రోడ్డులో ఫుట్ పాత్ మీద కూర్చుంటే కూడా పోలీసులు అంగీకరించని సన్నివేశం చూశాం. బలవంతంగా వారందరిని అక్కడ నుంచి తరలించారు. మరి ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను సాదరంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) కార్యాలయంలో కూర్చోబెట్టి మర్యాద చేసిన విషయం మర్చిపోకూడదు. దీనిని బట్టి ఎవరు ఎలా వ్యవహరించారో అర్దం అవుతుంది.
✍️చంద్రబాబు హెలికాప్టర్ లో విజయవాడకు వచ్చి ఉంటే సీఐడీ వారి విచారణ, రిమాండ్ రిపోర్టు కూడా తొందరగానే తయారయ్యేవి కదా? ఆయన ఎందుకు అలా చేయలేదు?. చంద్రబాబు మీద ఏదో రకంగా బురద జల్లాలన్న జగన్ ఉన్మాద ఆలోచనే కుట్ర అని రామోజీ తేల్చేశారు. ఈ కేసు పూర్వాపరాలు స్టడీ చేసి రెండు వైపులా రాస్తే ఫర్వాలేదు. అలాకాకుండా సీఐడీనే తప్పు పడుతూ, అది ప్రభుత్వానికి వంత పాడిందని రాశారు. ఈ కేసులో 371 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిఐడి అంత నిర్దిష్టంగా చెబుతుంటే దానికి విలువ ఇవ్వకుండా తెలుగుదేశం చేసే విమర్శలనే తన సంపాదకీయంగా రాసుకోవడం ఎంత దౌర్బాగ్యమో చెప్పనవసరం లేదు. గవర్నర్ అనుమతి లేకుండానే సిఐడి చంద్రబాబు ను అరెస్టు చేసిందని గగ్గోలు పెడుతున్న రామోజీరావుకు.. ప్రజాధనం రూ. 371 కోట్లు కొల్లగొట్టారన్న బాధ కించిత్ కూడా లేదన్న మాట. ప్రస్తుతం చంద్రబాబు ఒక ఎమ్మెల్యే మాత్రమే. పనిలో పని లోకేష్, పవన్ కల్యాణ్ లకు కూడా వత్తాసు పలుకుతూ తన విధేయతను చాటుకున్నారు.
యువగళం వలంటీర్లను కొట్టారట. ఆ వలంటీర్లు వాహనాలపైకి ఎక్కి రాళ్లు వేసిన విషయాన్ని మాత్రం దాచేయాలని ఎంత తాపత్రయపడుతున్నారు. అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయరాదని సుప్రీం కోర్టు చెప్పిందట. మరి అదే సుప్రీం కోర్టు ఎవరు అవినీతికి పాల్పడ్డా పర్వాలేదని ఏమైనా చెప్పిందా? అనేది కూడా రామోజీ వివరించి ఉంటే బాగుండేది. చంద్రబాబుపై అవినీతి బురద వేయడానికే తప్ప ఇందులో కేసే లేదని రామోజీ తన దృతరాష్ట్ర ప్రేమను దాచుకోలేకపోతున్నారు. ఈయనే ఫిలిం సిటీలో కూర్చుని తీర్పులు ఇచ్చేస్తున్నారు.
✍️ యావద్దేశం జి 20 సమావేశాలపై దృష్టి పెడితే.. ఏపీ పోలీసులు చంద్రబాబుపై పెట్టారని అంటున్న రామోజీ రావు తెలంగాణ ఎడిషన్ లో కూడా గుండెలు బాదుకుంటూ చంద్రబాబు కోసం విలపిస్తూ పేజీల కొద్ది విషపు రాతలు రాశారెందుకు? ఆయన జీ 20 సమావేశాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? పాపం పండిన రోజు ఎంతటి నిరంకుశ ప్రభువైనా ప్రజాగ్రహ ఉద్దృతిలో కొట్టుకుపోక తప్పదని రామోజీ సెలవిచ్చారు. అంటే ఆ రకంగానే చంద్రబాబు 2019 ఎన్నికలలో ప్రజాగ్రహానికి కొట్టుకుపోయారని రామోజీ చెబుతున్నారా?.. నిత్యం జగన్ ప్రభుత్వంపై దారుణమైన చెత్తవార్తలు రాస్తున్న ఈనాడు నుంచి ఇంతకు మించి విలువలను ఎలా ఆశించగలం.
ఎందుకంటే రామోజీ స్వార్దం రామోజీది. తన మార్గదర్శి అక్రమాలను బయటపెట్టారన్న అక్కసుతో తన చేతిలో పత్రిక, టివి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఒక ముఖ్యమంత్రిపైన ,ఆంధ్రప్రదేశ్ పైన నిత్యం విషం చిమ్ముతున్న రామోజీకి అందులో పాపం కనిపించలేదా? కర్మ సిద్దాంతం తనకైనా అదే రీతిలో వర్తిస్తుందన్న సంగతి రామోజీ ఈ వయసులో కూడా గుర్తించలేకపోతున్నారా?..
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment