Kommineni Srinivasa Rao Article On TS Politics - Sakshi
Sakshi News home page

బీజేపీ ఉరకలు.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష..టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం!

Published Tue, Aug 9 2022 3:06 PM | Last Updated on Tue, Aug 9 2022 4:05 PM

Kommineni Srinivasa Rao Article On TS Politics - Sakshi

తెలంగాణ రాజకీయం వేగంగా కదులుతోందా? మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు నియోజకవర్గం అత్యంత కీలకం కాబోతోందా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. కొద్ది నెలల క్రితం హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం ఒక సంచలనం అయితే, అధికార టీఆర్‌ఎస్‌ కు పెద్ద శరాఘాతమే అయింది. తెలంగాణలో అతి తక్కువ శాతం ఓట్లు ఉంటాయనుకునే భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా రాజకీయ తెరపైకి ఒక కీలకమైన ప్లేయర్ గా అవతరించింది. అంతకుముందు దుబ్బాక నియోజకవర్గం ఫలితం కూడా బీజేపీకి ఉపయోగపడినా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక బాగా కలిసి వచ్చాయి. దాంతో ఎక్కడలేని ఉత్సాహంతో బీజేపీ ఉరకలు వేస్తోంది. 

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దం అవుతుండడంతో రాజకీయం వేడెక్కినట్లయింది. ఒక వైపు బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, మరో వైపు ఉప ఎన్నికకు సన్నాహాలతో ఆ పార్టీ హడావుడిగా కనిపిస్తోంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తన సత్తా చాటి వచ్చే శాసనసభ ఎన్నికలలో తనకు తిరుగు లేదని రుజువు చేసుకోవడానికి తహతహ లాడుతోంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక అని చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటపడడానికి, కేసీఆర్‌ ప్రజాకర్షణ తగ్గలేదని రుజువు చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.

టీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలవలేకపోతే మాత్రం ప్రభుత్వానికి ఇక్కట్లు వస్తాయన్న ఊహాగానాలకు ఆస్కారం కలుగుతుంది. కేసీఆర్‌ హవా తగ్గిందన్న భావన ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఎదుర్కోక తప్పదన్న భావన కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో అంతంత  మాత్రంగానే సంబంధాలు ఉన్న నేపద్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరిన్ని సమస్యలకు గురి అవుతుంది. మిగిలిన రాజకీయ పార్టీలలో  ముఖ్యంగా బీజేపీ గెలిస్తే వారికి ఎనలేని బలం సమకూరుతుంది. ఒకవేళ పరాజయం చెందితే, రెండో స్థానానికి వచ్చామని చెప్పుకోగలుగుతుంది. అలాకాకుండా గతంలో మాదిరి మూడో స్థానానికి పరిమితమయితే బీజేపీ నీరుకారి పోతుంది. కాని ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ముందు పెట్టుకుని సవాల్ విసురుతోంది. 

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో హుజూరాబాద్ లో రాజకీయం నడిపిన బీజేపీ , మునుగోడులో కూడా అదే తరహా వ్యూహం అమలు చేయబోతోంది. నిజానికి బీజేపీకి ఇక్కడ పెద్దగా బలం లేదు. రాజగోపాలరెడ్డి బలమే బీజేపీ బలం. ఆ సంగతి అందరికి తెలిసిందే. అందువల్లే మీడియాలో పోటీ రాజగోపాలరెడ్డికి, టీఆర్‌ఎస్‌ కు మద్య జరుగుతుందని విశ్లేషిస్తోంది. ఉత్తర తెలంగాణలో మాదిరి దక్షిణ తెలంగాణలో బీజేపీ గట్టి పట్టు ఇంకా సాధించలేకపోయిందన్న అభిప్రాయం ఉన్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చేరబోతుండడం ప్లస్ పాయింట్ అవుతుంది. త్రిపురలో బీజేపీకి ఒకప్పుడు అసలు బలం లేదు. కాని అక్కడ కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరిపోవడంతో ఏకంగా అధికారంలోకి వచ్చేయగలిగింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను ఢీకొట్టే పార్టీగా గుర్తింపు పొందడంతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్, సిపిఎంలు తుడిచిపెట్టుకోపోయాయి. ఈ ప్రకారమే తెలంగాణలో బీజేపీ ప్లాన్ ను అమలు చేస్తూ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు, టీఆర్‌ఎస్‌ నుంచి ద్వితీయ శ్రేణి నేతలను కూడా ఆకర్షించే పనిలో పడ్డారు. చివరికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు కూడా టీఆర్‌ఎస్‌‌కు గుడ్ బై చెప్పబోతుండడం విశేషమే. 

మరో వైపు బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్  ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన పలు ఆరోపణలు సంధిస్తున్నారు. కుటుంబ పాలన అన్న విమర్శను ప్రధానంగా తీసుకు వస్తున్నారు. ఈయనకు మద్దతుగా కేంద్రం నుంచి మంత్రులు కూడా తరలివచ్చి కేసీఆర్‌ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ ప్రాజెక్టు నిలబడదన్నంతగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్‌ కు ఏటీఎం అయిందని ఆయన అన్నారు. ఈ విమర్శలు వింటే, గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలు గుర్తుకు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఎటిఎమ్ అయిందని ఆయన ఆరోపించారు. దేశ ప్రధాని ఒకరు ఇలాంటి ఆరోపణ చేయడం అంటే చాలా సీరియస్ విషయం కింద లెక్క. కాని ఎన్నికల తర్వాత కేంద్రం ఆ ఊసే పట్టించుకోలేదు. పైగా అది కేంద్ర నిదులతో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు. కాని కాళేశ్వరం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. ఇందులో అవినీతి అని కేంద్ర మంత్రులు చెబితే వారు బాధ్యతాయుతంగా ఆరోపణలు చేయాలి. అంతే తప్ప ఇలాంటి అంశాలలో రాజకీయ ఆరోపణలు చేయడం పద్దతి అనిపించుకోదు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనాలు, వ్యయం అయిన వైనంపై వచ్చే వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. 

కేసీఆర్‌ ప్రభుత్వంపై కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు, పామ్ హౌస్ లోనే కేసీఆర్‌ ఎక్కువగా ఉంటారన్న ఆరోపణ మొదలైనవాటి ఆధారంగా టీఆర్‌ఎస్‌ ను దెబ్బకొట్టాలని బీజేపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తాను ముందుకు రావడమే కాకుండా, ఏకంగా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహ రచన చేస్తుండడం తెలంగాణ లో పెద్ద పరిణామంగా చెప్పవచ్చు. బీజేపీ చిన్న రాష్ట్రాల విధానం కూడా ఇందుకు కొంత ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చాక, కొన్ని వర్గాలలో ముఖ్యంగా యూత్ లో కొంత క్రేజ్ తెచ్చుకున్నారు. కాని అదే సమయంలో ఆయనకు అసమ్మతి కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా ఆయనపై టిడిపి ముద్ర, చంద్రబాబు నాయుడి ముద్ర ఉండడం పెద్ద మైనస్ గా ఉంది. దానికి తోడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మూడువేల ఓట్లు కూడా రాకపోవడం అప్రతిష్ట అయింది. ఈ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాలరె్డ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావడం కాంగ్రెస్ కు పెద్ద పరీక్ష కాబోతోంది. ముందుగా వారికి అక్కడ సరైన అభ్యర్ది దొరకవలసి ఉంది. 

రాజగోపాలరెడ్డి సోదరుడు ఎమ్.పి గా ఉన్న వెంకటరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నా,ఆయన ఒప్పుకోవడం కష్టమే కావచ్చు. ఒకవేళ అంగీకరించినా, సోదరుడి ఓడించగలుగుతారా అన్నది సంశయమే. మునుగోడు లో కాంగ్రెస్కు గట్టిపట్టు ఇంతకాలం ఉండేది. గతంలో పాల్వాయి గోవర్దనరెడ్డి కీలక నేతగా ఉండేవారు. ఆ తర్వాత సిపిఐ కూడా కొన్నిసార్లు గెలిచింది. కాని ఇప్పుడు సిపిఐ పూర్తిగా దెబ్బతినిపోయింది. కాంగ్రెస్ లో గోవర్దనరెడ్డి కుమార్తె యాక్టివ్ గానే ఉన్నా, ఆమె ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారో చెప్పలేం. దానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తనతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలలో పలువురిని కూడా వెంటబెట్టుకుని బీజేపీలో చేరడానికి సిద్దం అవుతున్నారు. రాజకీయంగా కోమటిరెడ్డి సోదరులకు నల్లగొండ జిల్లాలో కొంత పట్టు ఉంది. ఆయా నియోజకవర్గాలలో తమ సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఒక దశలో పిసిసి నాయకత్వం ఆశించారు. తమకు బాధ్యత అప్పగిస్తే పార్టీని అదికారంలోకి తీసుకువస్తామని గతంలో అధిష్టానం వద్ద చెప్పినా, ఎందువల్లనో అదినాయకత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యను,తదుపరి ఉత్తంకుమార్ రెడ్డిని పిసిసి అద్యక్షులుగా చేసి పెద్దగా సఫలం కాలేకపోవడం, ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పలువురు టీఆర్‌ఎస్‌ లో చేరిపోవడం ఈ పార్టీకి నెగిటివ్ అవుతోంది. ఇక టిడిపి నుంచి వచ్చి పిసిసి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న రేవంత్ రెడ్డి అంటే పలువురు సీనియర్ లకు గిట్టడం లేదు. 

ఒక వైపు రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ లో కొనసాగించడానికి బుజ్జగింపులకు దిగితే, మరో వైపు ఆయన బీజేపీ వేసిన బిస్కట్లకు ఆశపడ్డారని, సోనియాగాందీకి వెన్నుపోటు పొడిచారని తీవ్రమైన ఆరోపణలను రేవంత్ గుప్పించారు. దానికి మరింత ఘాటుగా కోమటిరెడ్డి స్పందించారు. చంద్రబాబే తెలంగాణలో కాంగ్రెస్ ను, రేవంత్ ను నడిపిస్తున్నారని, అందువల్లే పార్టీ నాశనం అయిందని బదులు ఇచ్చారు. ఒకసారీ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతాయి. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య మునుగోడు లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడం. కాంగ్రెస్ గెలిస్తే మంచి ఊపే వస్తుంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి బలమే ఉంది. కాని స్వయంకృతాపరాధాలతో దెబ్బతింటోంది. మునుగోడులో మూడో స్థానానికి పరిమితం అయితే మాత్రం దాని ప్రభావం రాష్ట్రం అంతటా గణనీయంగా పడుతుంది. ఒకవేళ ఓటమి చెందినా రెండో స్థానంలో ఉన్నా, బీజేపీకన్నా ముందంజలో ఉన్నామన్న సంతృప్తి మిగులుతుంది. బీజేపీకన్నా టీఆర్‌ఎస్‌ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోగలుగుతుంది. ఏతావాతా చెప్పాలంటే ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ కు అత్యంత ప్రతిష్టాత్మకం కాగా, కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష వంటిది కాగా, బీజేపీకి లాటరీ వంటిదని విశ్లేషించవచ్చు. 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement