Kommineni Srinivasa Rao Comments On TDP Gorantla Madhav Fake Video, Details Inside - Sakshi
Sakshi News home page

గోరంట్ల మాధవ్‌ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా?

Published Fri, Aug 12 2022 4:04 PM | Last Updated on Fri, Aug 12 2022 5:23 PM

Kommineni Srinivasa Rao Comment On TDP Fake Video - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టాలో అర్దంకాక తెలుగుదేశం పార్టీ అశ్లీల వీడియోలపై ఆధారపడుతన్నట్లుగా ఉంది. చివరిక ఆ  పార్టీకి సంబంధించిన ఐ టీడీపీ గ్రూప్ వాట్సప్ లోనే ఈ వీడియో పోస్టు అయిందన్న సమాచారం వచ్చాక టీడీపీకి బూమ్ రాంగ్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. హిందుపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన అశ్లీల వీడియో అంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మీడియా చేసిన వికృత ప్రచారం చూశాక టీడీపీ రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయి. ఇంకెంత అధమస్తాయికి వెళతారో అని అనిపిస్తుంది. అసలు ఆ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడంతో టీడీపీకి పరువు నష్టం అయింది. 

ఇదంతా కుట్రగా సాగిందని అర్దం అవడం కష్టం కాదు. టీడీపీ ఈ విషయంలో కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా వ్యవహరించి తాము ఏమి చేస్తున్నానో, దానివల్ల పార్టీకి ఎంత నష్టమో అన్న స్పృహ కూడా లేకుండా నేతలు ప్రవర్తించారు. ఏదైనా ఒక అశ్లీల వీడియో బయటకు వస్తే ఏమి చేస్తాము? దానిని వెంటనే పోలీసులకు అప్పగించి తగు చర్య తీసుకోవాలని బాదితులు కోరతారు. గోరంట్ల మాధవ్ కేసులో బాదితులు ఎవరూ లేరు. పైగా ఆయన వీడియోని మార్పింగ్ చేశారని అనంతపురంలో ఒకరు సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ జరగడానికి ముందుగానే టీడీపీ మీడియా నానా రచ్చ చేశాయి.

ఏపీలో ఇదే ప్రధానమైన సమస్య అన్న చందంగా పోకస్ చేశాయి. నిజమే. ఎవరైనా ప్రజా ప్రతినిది అందరికి ఆదర్శంగా ఉండాలి. అదే సమయంలో ఆయనపై ఎవరైనా కుట్ర పన్ని అసభ్య వీడియోని ప్రచారంలోకి తెచ్చినా గట్టి చర్యలే తీసుకోవాలి. పోలీసుల దర్యాప్తులో ఆ వీడియో బ్రిటన్ నుంచి పోస్టు అయినట్లు, తొలుత ఐటీడీపీ వాట్సప్ లో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీవారే దీనిని సృష్టించి అల్లరి చేశారా? ఒక వేళ ఏదైనా మార్గంలో టీడీపీవారికి అలాంటి వీడియో అంది ఉంటే , దానిని యదాతదంగా పోలీసులకు ఇచ్చి దర్యాప్తు చేయాలని అడిగి ఉంటే అదో పద్దతిగా ఉండేది. కాని సామాజిక మాద్యమాల ద్వారా విస్తారంగా ప్రచారం చేసి మాధవ్‌కు, తద్వారా వైసీపీకి రాజకీయంగా నష్టం చేయడానికి ప్రయత్నించారు.

కాని ఈ క్రమంలో ఇది తమకే ఎదురు దెబ్బ తగులుతుందని వారు ఊహించలేకపోయారు. తొలుత వైసీపీ ఈ విషయంలో కొంత ఇబ్బంది పడింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ, ఆ వీడియో  మార్పింగ్‌ది కాదని తేలితే మాధవ్ పై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. అయినా టీడీపీ ఆగలేదు. మరింతగా రెచ్చిపోయి అర్జంట్ గా మాధవ్ ను సస్పెండ్ చేయాలని, ఇంకేదో చేయాలని డిమాండ్ చేస్తూ చర్చలు , కథనాలు నడిపాయి.ఈ నేపద్యంలో పోలీసులు వివిధ కోణాలలో పరిశోదించి ఈ వీడియో ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయింది కనుగొన్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని , పలు మార్పులు జరిగాయని, ఎవరో ఏదో వీడియో చూస్తుంటే, దాని నుంచి రికార్డు చేసినట్లుగా ఉందని పోలీసులు ప్రకటించారు.

ఒరిజినల్ వీడియో అయితేనే పోరెన్సిక్ లాబ్ కు పంపగలుగుతామని స్పష్టం చేశారు. దీంతో బిత్తరపోయిన టీడీపీ మీడియా దిక్కుతోచని విధంగా కారుకూతలు కూస్తూ చర్చలు జరిపింది. టీడీపీకి ఏ రకంగా నష్టం జరిగిందో చూద్దాం. తొలుత ఈ వీడియో ఐటీడీపీ నుంచే పోస్టు అయిందన్న విషయం అందరికి తెలియడంతో ఇది ఆ పార్టీ కుట్ర అన్న సంగతి ప్రజలకు బోధపడింది. ఒక రాజకీయ పార్టీ ఇంత నీచంగా అసభ్య వీడియోలను వాడుకోవచ్చా అన్న ప్రశ్నకు తావిచ్చారు. అంతేకాక రాజకీయ పార్టీలు కూడా హానీ ట్రాప్ వంటివాటికి పాల్పడతాయా? తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా వ్యవమరిస్తోందా అన్న విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఫలితంగా టీడీపీకి ఎదురు దెబ్బ తగిలి వారి ప్లాన్ బెడిసికొట్టి బూమ్ రాంగ్ అయిందని చెప్పాలి.

మరో విషయం ఏమిటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో సుధీర్గ అనుభవం కలిగిన వ్యక్తి అయినా, ఈ వివాదంలో కూడా ఆయన తలదూర్చి అనవసర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు ఆయన బావమరిది బాలకృష్ణకు, కుమారుడు లోకేష్ కు, మరి కొన్ని ఘటనలలో టీడీపీ నేతలకే తగులుతాయని సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలను వైసిపి సోషల్ మీడియాలో వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆడవారు కనిపిస్తే అయితే ముద్దు పెట్టుకోవాలి, కడుపైనా చేయాలి అని బాలకృష్ణ నిండు సభలో అని అందరిని విస్తుపరిచారు.మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. వాటిని ప్రస్తావించడం కూడా అసభ్యంగానే ఉంటుంది. ఇంత చేసినా చంద్రబాబు నాయుడు ఆయనను ఖండించకపోగా మరోసారి హిందుపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.

ఇక తన కుమారుడు లోకేష్ గతంలో  పలువురు మహిళలతో విలాసాలు నడుపుతున్న పోటోలు మళ్లీ సర్కులేషన్ లోకి వచ్చాయి. ఆ పోటోలు కొన్నేళ్ల క్రితమే బయటకు వచ్చాయి. అయినా అప్పుడు చంద్రబాబు తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి, ఆ తర్వాత మంత్రిని కూడా చేశారు. వనజాక్షి అనే తహాశీల్దార్ ను దెందులూరు ఎమ్ఎల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో ఆయన అనుచరులు దుర్మార్గంగా అవమానించి దౌర్జ్యం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు తహశీల్దార్ ను  తప్పుపట్టి, ప్రభాకర్ కు విప్ గా ప్రమోషన్ కూడా ఇచ్చారు.

కాల్ మనీ సెక్స్ ఘటనల కారణంగా టీడీపీ హయాంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటన్నిటిని మర్చిపోయి టీడీపీ నేతలు జనంలో మాదవ్ వడియోను ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించి భంగపడ్డారు. దీనికి కులం రంగు పులుముకోవడంతో అనంతపురం జిల్లాలో బలంగా ఉండే బసిలను ముఖ్యంగా కురుబ వర్గం వారిని మరింత దూరం చేసుకునే పరిస్తితి ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా బిసిలలో టీడీపీ శైలి మరింత అసంతృప్తి కలిగించింది. ఇంకో సంగతి కూడా చెప్పాలి. సాధారణంగా ఈ వీడియోలు చూడడానికి ఎవరం ఇష్టపడం. అలాంటి వీడియోలపై తెలుగుదేశం పార్టీ ఏకంగా మహిళా నేతలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించింది. వారిలో కొందరేమో తాము ఆ వీడియోలను చూడలేకచచ్చామని, ఇంకేదేదో మాట్లాడి ,అందరూ ముక్కున వేలేసుకునేలా చేశారు. ఒక రాజకీయ పార్టీ ఇలాంటి వికృత విన్యాసాలకు పాల్పడడం అవసరమా?ఇలాంటివాటివల్ల అధికారం లభిస్తుందా?

విపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో తనదేనని ఇంతవరకు ధృవీకరించని విషయం, ఫోరెన్సిక్‌  నివేదిక ఏమైందో తెలియని అంశాన్ని కూడా అంతా గుర్తుకు చేసుకున్నారు. ప్రముఖ నటి దివ్యవాణి, మరో మహిళా నేత యామిని వంటివారు టీడీపీలో కొందరి గురించి ఎలా మాట్లాడారో అందరికి తెలుసు. ఈ మధ్యనే టీడీపీ చిన్న నేత ఒకరు టీడీపీ ఆఫీస్ లో మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. 

ఆమె ఏమి అన్నది రాయడానికే ఇబ్బందిగా ఉంటుంది. ఇవేకాదు. మరికొన్ని ఉదాహరణలు కూడా చూడవచ్చు. చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న మంత్రులలో కొందరు ఒకరిని మించి మహిళలను వివాహమాడడమో, లేక సహజీవనం చేయడమో జరుగుతుండేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ చాలా కధే అవుతుంది.  తెలుగుదేశం వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతిని టీడీపీ వారు ఎంత ఘోరంగా అవమానించింది పాతికేళ్ల క్రితం రాజకీయాలు చూసినవారందరికి తెలసు. ఎన్టీఆర్‌ ఇష్టపడ్డ వ్యక్తి అన్న కనీస గౌరవం కూడా లేకుండా ప్రవర్తించేవారు. 

ఎన్‌టీఆర్‌ను పదవి నుంచి దింపడానికే ఈమెనే బూచిగా చూపించేవారు. టీడీపీని స్వాదీనం చేసుకునే క్రమంలో ఈ నేతలు కొందరు ఏమేమి చేసింది ఇప్పటికీ కదలు,కదలుగా చెప్పుకుంటారు.  వైసిపిలో మహిళలకు గౌరవం లేదని టీడీపీ ఎమ్.పిలు ఆరోపించారు. మరి టీడీపీలో ఇలా అనేక ఘటనలు సంభవించాయి కనుక ఆ పార్టీ ఇంకా ఘోరమైన పార్టీ అని ఒప్పుకుంటారా? కొందరు వ్యక్తులు చేసే పనుల వల్ల ఆయా పార్టీలకు కొంత ఇబ్బంది వస్తుంది.దానిని కాదనలేం. కాని అంతమాత్రాన మొత్తం పార్టీకి పులమాలనుకునే ప్రయత్నమే టీడీపీకి బెడిసికొడుతుందన్న సంగతి తెలుసుకోవాలి. టీడీపీ వారు  హానీ ట్రాప్ లు మరిన్ని చేశారని ప్రచారం జరుగుతోంది. ముందుగా బిసి ఎమ్.పిని సస్పెండ్ చేయించగలిగితే తమ రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టవచ్చనుకున్న వారి ఆలోచనకు ప్రభుత్వం సకాలంలో స్పందించి  గండి కొట్టింది.రాజకీయాలలో అన్ని వేళలా ఇలాంటి చెత్త వ్యూహాలు పనిచేయవు. ప్రజా సమస్యలను వదలిపెట్టి ఇలాంటి చిల్లర విషయాలపైనే తెలుగుదేశం దృష్టి కేంద్రీకరిస్తే ఆ పార్టీకే అంతిమంగా నష్టం జరుగుతుంది. చివరిగా ఒక మాట. ఈ ఉదంతం అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు వంటిదని చెప్పాలి. 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement