ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమి చేసినా విన్నూత్నంగా , పారదర్శకంగా ఉండేలా చేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ఆయన అనుసరించిన విదానం అలాగే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన వైనం సంచలనంగా ఉంది. ఈ ఉదంతం దేశంలోనే అరుదైన ఘట్టంగా చెప్పాలి.
ఒక కుటుంబం అందులోను రాజకీయ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం జరిగినప్పుడు ,వాటిని వివాదాస్పదం చేయాలని ప్రత్యర్ధి వర్గాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక రాజకీయ నేత ఇంత బహిరంగంగా తేల్చేస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. తల్లి,కుమారుల మధ్య ఏదో జరిగిందని విస్తారంగా చెప్పడం ద్వారా వైసీపీకి నష్టం చేయాలని అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ప్రయత్నిస్తున్నప్పుడు జగన్ వ్యూహాత్మకంగా ఈ వైఖరి అనుసరించడం ఆసక్తికరమైన విషయమే.
బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఒక పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అదే పార్టీ ప్లీనరీలో ప్రకటించడం జరిగి ఉండదు. ఒకవేళ అలా జరిగితే పెద్ద గొడవగా మారుతుంది. కానీ అందుకు భిన్నంగా విజయమ్మ వ్యవహరించిన శైలి, జగన్ ఆమెను గౌరవించిన తీరు కచ్చితంగా అభినందనీయం. వైఎస్ కుటుంబంలో ఏది పెద్ద రహస్యం కాదని, చెప్పేదేదో ఫెయిర్ గా చెబుతామని వారు స్పష్టం చేసినట్లుగా ఉంది. అంతకుముందు జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత స్పందించిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంది.
షర్మిల పార్టీ పెట్టడం తమకు ఆమోదయోగ్యం కాదని, అయినా ఆమె తన అభీష్టం ప్రకారం పెట్టుకున్నారని , ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రకటింపచేశారు. దాంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది. షర్మిల కూడా అంతే హుందాగా వ్యవహరించి తనకు సోదరుడితో విభేదాలు లేవని తెలిపారు. ఒక మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ విషయంలో చాలా సమయస్పూర్తిగా సమాధానాలు ఇచ్చారు. ఈ విషయాలపై చిలవలు,పలవలుగా కధనాలు వండి వార్చడానికి కొన్ని మీడియా సంస్థలు సహజంగానే ప్రయత్నిస్తుంటాయి. వార్త ఇవ్వడం వరకు ఎవరూ ఆక్షేపించారు. కాని ఉన్నవి,లేనివి చెప్పి వక్రీకరించడమే దారుణంగా ఉంటుంది.
అమ్మ అవుట్ అని, బలవంతంగా రాజీనామా చేయించారని , ఇక మరో టార్గెట్ ఫలానా అని తమకు తోచిన కథనాలు రాశారు. వీటన్నిటికి చెక్ పెడుతూ విజయమ్మ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆమె ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. వ్యతిరేకార్దం వచ్చేలా మాట్లాడలేదు. ప్లీనరీలో మెదటి రోజు పాల్గొన్న సుమారు రెండు లక్షలమందికే కాక, టీవీల ద్వారా చూసే లక్షలాది ప్రజలకు అర్దం అయ్యేలా తన ఉపన్యాసం చేశారు.తన మధ్దతు ఎల్లవేళలా జగన్ కు ఉంటుందని, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలవాలని అనుకున్నప్పుడు అనవసర వివాదాలు తలెత్తకుండా ఉండడానికే తాను ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని విస్పష్టంగా వివరించారు. విజయమ్మ పార్టీకి అదే హోదాలో ఉండాలని ఎక్కువ మంది కార్యకర్తలు కోరుకుని ఉండవచ్చు. కాని ఆమె తన కారణాలను తెలియచేశారు. కాగా విజయమ్మ ప్రసంగం ఆద్యంతం జగన్ తో సహా సభికులంతా ఆసక్తిగా విన్నారు.
ఆ తర్వాత ఆమె తన సీటు వద్దకు వెళ్లినప్పుడు జగన్ ఆమెను సాదరంగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టారు. అంటే దీని అర్ధం ఏమిటి? తమ మధ్య విబేధాలు లేవని, ప్రేమాభిమానాలు తగ్గలేదని వారు రుజువు చేసుకున్నారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి తప్పుకున్నానని చెప్పిన తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ విజయమ్మ అలా చేయకుండా తన కుమారుడి పక్కనే సాయంత్రం వరకు కూర్చోవడం గమనించదగ్గ అంశం. అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు కూడా ప్లీనరీలో పాల్గొని ఒక వర్గం మీడియాకు సమాధానం చెప్పారు. విజయమ్మ ఉపన్యాసంలోని కొన్ని అంశాలను చూద్దాం.
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె ప్రకటించారు. ఇక్కడ ఎక్కడా ఆమె ఇద్దరు పిల్లల మధ్య తేడా చూపించాలని అనుకోలేదు. జగన్ ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల మద్దతు పొందుతున్నందున ఆమె షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు భిన్నంగా షర్మిల గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటే అది చర్చనీయాంశం అయి ఉండేది. అలాంటి అవకాశం ఆమె ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని ఆమె కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్‌కు ఒక స్టాండ్ ఉంటుంది.
అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా.జగన్ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్‌ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నాఅని అన్నారు. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా విజయమ్మ ఏదో జగన్ కు వ్యతిరకంగా ఉన్నారనో, లేక జగన్ తన తల్లిని విస్మరించారనో ప్రచారం చేస్తే ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి గత చరిత్రను చూద్దాం.
విజయమ్మ తన రాజకీయ సరళి మార్చుకుంటూ చేసిన ప్రసంగంలో జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తే, తెలుగుదేశం వ్యవస్థాపకుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తన అల్లుడు చంద్రబాబును ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది గుర్తుకు తెచ్చుకుంటే వీరి మద్య ఉన్న వ్యత్యాసం తేలికగా అర్ధం అవుతుంది. తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసే క్రమంలో వైస్రాయి హోటల్ వద్ద ఆయనపై చెప్పలు వేయడం మొదలు , తాను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్.టి.ఆర్.నిస్సహాయంగా నిండు శాసనసభలో నిలబడిన వరకు జరిగిన ఘటనలు చూస్తే ఎవరు ఎలా వ్యవహరించారో విదితమవుతుంది. ఆనాటి స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు పదే,పదే మైక్ కట్ చేసి ఎన్ టి.ఆర్.ను పరాభవిస్తుంటే, చంద్రబాబు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండిపోయారేకాని వారించలేదు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.ను పార్టీ నుంచి తొలగించి, అధ్యక్ష పదవిని కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు మరో వైపు విజయమ్మ పార్టీ ప్లీనరీలో మాట్లాడి పూర్తి గౌరవం పొందారు.ముఖ్యమంత్రి పక్కన కూర్చుని సభను ఆలకించారు.
అయినా చంద్రబాబు మాత్రం వైఎస్ కుటుంబంలో ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా అయితే శరభ,శరభ అంటూ పూనకం వచ్చినట్లుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. టిడిపిని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు తో ఆయన బావమరుదులు జయకృష్ణ, హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, స్వయంగా తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు వంటివారికి ఆయా సందర్భాలలో ఏర్పడిన విబేధాల సంగతి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు.
దగ్గుబాటి పుస్తకంలో ఏమి రాశారో చూస్తే పలు విషయాలు తెలుస్తాయి. రాజకీయాలలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. పలు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్లీనరీలో మాత్రం ఎలాంటి గొడవలు,గందరగోళాలు లేకుండా ఈ ఉదంతం ముగియడం విశేషమే. టిడిపికి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు మాత్రం అది తీవ్ర నిరుత్సాహం కలిగించే విషయమే.
-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment