
తాడేపల్లిగూడెం అర్బన్: వెంటిలేటర్‌పై ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసేందుకు ప్రయత్నిస్తుండటం పవన్‌కల్యాణ్ అవివేకమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎన్నికల విషయంలో పవన్ సందిగ్ధంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు మూడు ఆప్షన్లు చెప్పిన పవన్‌కు పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు.
చంద్రబాబు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మహిళలు తొడలు చరచడాన్ని బట్టి ఆ పార్టీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారో బహిర్గతం అవుతోందన్నారు. 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సత్యనారాయణ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్ పర్యటన విజయవంతం అవుతుందన్న అక్కసుతో దానిని పక్కదారి పట్టించేందుకు కోనసీమలో చిచ్చు రేపిన కుట్రదారులు టీడీపీ నాయకులని చెప్పారు.