ఏపీలో ఎవరు విజనరి? తాను విజనరీని అని నిత్యం ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ ఏమిటి? ఎలాంటి పబ్లిసిటీ లేకుండా పలు వ్యవస్థలను తీసుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు ఉన్న విజన్ ఏమిటి అన్నది పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. విజన్ -2047 డాక్యుమెంట్ ను ఒక డొల్ల పత్రంగా, చంద్రబాబుది మోసపూరిత విజన్‌గా జగన్ అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని గమనించి ఆలోచించవలసిన అవసరం ఏపీ ప్రజలపై ఉంటుంది.ఆయన ప్రకటన చూస్తే ఎవరు ఏపీకి మేలు చేసే విధంగా విజన్ తో పనిచేశారో తెలుస్తోంది.చంద్రబాబు మొత్తం విజన్‌ల పేరుతో కథ నడపడమే కాని, చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా?అని జగన్ ప్రశ్నించారు. ఇది అర్దవంతమైన ప్రశ్నే. ఎందుకంటే విభజిత ఏపీలో ఐదేళ్లు, అంతకుముందు ఉమ్మడి ఏపీకి సుమారు ఎనిమిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న ఆయన మళ్లీ గత ఆరు నెలలుగా ఆ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విజన్ 2020 అని ,విజన్ 2029 అని, విజన్ 2047 లని ఇలా రకరకాల విజన్‌లు పెట్టడమే తప్ప,వాటి ద్వారా ఏమి సాధించింది చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు హైదరాబాద్ లో అది చేశా..ఇది చేశా..అని అనడమేకాని ,విభజిత ఏపీలో తన హయాంలో ఫలానా గొప్ప పని చేశానని వివరించలేకపోతున్నారు.నిజంగానే ఆయనకు అంత మంచి విజన్ ఉంటే,హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఐటి రంగాన్ని ఎందుకు తీసుకు రాలేకపోయారు?హైదరాబాద్‌లో ఒక హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించిన మాట నిజం.కాని అంతకుముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో రాజీవ్ గాంధీ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశారు.మరి ఆయనది విజన్ కాదా?చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైటెక్ సిటీ ప్రాంతంకాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంగాని అబివృద్ది చెందాయి
ఆ రోజుల్లో దానికి ఎలా అడ్డుపడాలా అన్న ఆలోచనతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పనిచేసింది. ఈ విధంగా తాము అధికారంలో లేనప్పుడు పలు అభివృద్ది పనులకు ఆటంకాలు కల్పించడంలో మాత్రం చంద్రబాబు టీమ్ కు చాలా విజన్ ఉందని చెప్పవచ్చు.మరో సంగతి కూడా చెప్పాలి. రాజకీయాలలో వైఎస్ కుమారుడు జగన్ దూసుకు వస్తారని ఊహించిన చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి అక్రమ కేసులలో ఇరికించి జైలుపాలు చేశారు.ఈ విజన్ మాత్రం బాగానే ఉందని చెప్పాలి.జగన్ పై ద్వేషంతో చీరాల ప్రాంతంలో అప్పట్లో తీసుకురాదలిచిన వాన్ పిక్ కు అడ్డుపడ్డారు.ఆ పారిశ్రామికవాడ వచ్చి ఉంటే ,ఇప్పుడుతడ వద్ద ఉన్న శ్రీసిటీ మాదిరి అభివృద్ది చెంది ఉండేది.విభజిత ఏపీకి అది పెద్ద ఆభరణంగా ఉండేది. వైఎస్ టైమ్ లో శ్రీసిటీ భూమి సేకరణకు కూడా టీడీపీ,అలాగే ఈనాడు వంటి ఎల్లో మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. అయినా వైఎస్ ఆగలేదు కనుక అది ఒక రూపానికి వచ్చింది.
ఇప్పుడేమో శ్రీ సిటీ అభివృద్దిలో తమకు వాటా ఉన్నట్లుగా చంద్రబాబు పిక్చర్ ఇస్తుంటారు.విభజిత ఏపీలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఎంతసేపు సోనియాగాంధీని దూషించడం ,తదుపరి ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిపోయడం, వీటికోసం నవనిర్మాణ దీక్షలని, ధర్మపోరాట దీక్షలని డ్రామాలు ఆడారు. ఆ తర్వాత కాలంలో సోనియాను, మోడీని పొగుడుతూ వారితోనే రాజకీయంగా జత కట్టారు.అది ఆయన విజన్.తన పాలనలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు.ఆ కమిటీలలో టీడీపీ నేతలను పెట్టి గ్రామాలలో అరాచకం సృష్టించారు.అది అప్పటి విజన్ అనుకోవాలి.అదే జగన్ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను తెచ్చి, గ్రామ,వార్డు సచివాలయాలను పెట్టి పాలనను ప్రజల చెంతకు చేర్చారు.దీనిని కదా విజన్ అనాల్సింది.చంద్రబాబు తన టైమ్ లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తీసుకురాలేదు. జగన్ తన టైమ్‌లో పదిహేడు మెడికల్ కాలేజీలను తెచ్చి, వాటిలో ఐదు నిర్మాణం పూర్తి చేశారు.
అది విజన్ కాదా? చంద్రబాబు ఏమి చేశారు. కూటమి అదికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం మంజూరు చేసిన మెడికల్ సీట్లను అక్కర్లేదని లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రవేటు రంగంలోకి మళ్లించాలని చూస్తున్నారు.జగన్ నాలుగుపోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి.చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ఓడరేవు అయినా నిర్మించారా?ఇప్పుడేమో జగన్ తీసుకు వచ్చిన పోర్టులను ప్రైవటైజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది చంద్రబాబు విజన్.వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి ,వారికి తాము నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారు.
అది చంద్రబాబు విజన్ అనుకోవాలి. గత జగన్ పాలనలో ఇళ్ల వద్దకే ఏ సర్టిఫికెట్ అయినా తెచ్చి ఇచ్చేవారు.చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే ఆ పద్దతి ఆగిపోయింది.మళ్లీ ఆఫీస్ ల చుట్టూ తిరిగేలా చేసిన విజన్ కూటమిది.వృద్దులకు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచింది నిజమే అయినా,ఇప్పుడు అర్హత పేరుతో లక్షల సంఖ్యలో తొలగిస్తున్నారు.స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్ దారులలో దొంగలున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము పెన్షన్ దారులలో అనర్హులను ఏరివేస్తామని చెప్పకపోగా, ఎక్కడైనా ఒకటి,అరా పెన్షన్ దారులలో కోత పడితే జగన్ పై విరుచుకుపడేవారు.
ఇప్పుడేమో గెలిచాక టీడీపీ వారు కొత్త రాగం అందుకున్నారు. జగన్ స్కూళ్లు బాగు చేసి ,అందులో ఆంగ్ల మీడియంతో సహా పలు అంతర్జాతీయ కోర్సులను తీసుకు వస్తే చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేస్తోంది.వీరిద్దరిలో ఎవరు విజనరీ అనుకోవాలి.పిల్లలకు టాబ్ లు ఇచ్చి వారి చదువులకు జగన్ ఉపయోగపడితే, వాటిపై దుష్ప్రచారం చేసినవిజన్ టీడీపీది,ఎల్లో మీడియా ఈనాడు ది.ప్రస్తుతం పిల్లలకు టాబ్ లు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. జగన్ పిల్లలకు విద్యే సంపద అని పదే,పదే చెప్పేవారు.చంద్రబాబు గతంలో అసలు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యతే కాదని అనేవారు.
చంద్రబాబు తన హయాంలో మిగులు రెవెన్యూ చూపారా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కదా!ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రెవెన్యూలోటే ఎందుకు ఉందని ఆయన అడుగుతున్నారు.జగన్ పాలనలో పేదల చేతిలో డబ్బులు ఉండేవి. దాని ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కరోనా వంటి సంక్షోభంలో కూడా సజావుగా సాగింది.తత్ఫలితంగా జిఎస్టి దేశంలోనే అత్యధికంగా వచ్చిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అది ఎందుకు తగ్గిపోయింది. గత నెలలో ఏకంగా ఐదువందల కోట్ల జిఎస్టి తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి.
జగన్ గ్రీన్ ఎనర్జీమీద కేంద్రీకరించి, రైతులకు మంచి కౌలు వచ్చేలా పారిశ్రామికవేత్తలకు భూములు ఇప్పిస్తే చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని తీవ్రమైన విమర్శలు చేసేవారు.కాని ఇప్పుడు అదే పద్దతిని కూటమి ప్రభుత్వం చేపడుతోంది.జగన్ టైమ్ లో రైతులకు కేంద్రం సూచన మేరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని ఉరితాళ్లుగా ప్రచారం చేసిన విజన్ చంద్రబాబుది.
తాము అధికారంలోకి రాగానే యధాప్రకారం స్మార్ట్ మీటర్లను పెడుతున్న విజన్ కూటమి ప్రభుత్వానిది అని చెప్పాలి.జగన్ ప్రజల ఇళ్లవద్దకే వైద్య సదుపాయం కల్పించడానికి ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు.అది ఆయనవిజన్ అయితే,ఇప్పుడు ఆస్పత్రులలో దూది కూడా లభించకుండా చేసిన విజన్ ఈ ప్రభుత్వానిదని అనుకోవాలి.కరెంటు చార్జీలు పెంచబోనని,తగ్గిస్తామని పదే,పదే ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిరాగానే పదిహేనువేల కోట్ల మేర భారం వేసిన విజన్ ఆయన సొంతం అని చెప్పాలి.ఇసుక, మద్యం వంటి వాటి ద్వారా కూటమి నేతలు బాగా సంపాదించుకునేలా మాత్రం చంద్రబాబు ప్రభుత్వం విజన్ తో పనిచేసిందని చెప్పాలి.
పేదలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది జగన్ విజన్ అయితే, పేదలను ధనికులు దత్తత తీసుకోవాలన్న ఆచరణ సాధ్యం కాని విజన్ చంద్రబాబుది. అయితే అమరావతిలో ఒక రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టనక్కర్లలేదని చెప్పి, పవర్ లోకి రాగానే ఏభైవేల కోట్ల అప్పు తీసుకువస్తున్న చంద్రబాబుది ఏమి విజన్ అని అడిగితే ఏమి చెబుతాం. ఆయనది రియల్ ఎస్టేట్ విజన్ మాత్రం చెప్పక తప్పదు.
జగన్ ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంభించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నించారు.కాకపోతే తనది విజన్ అని ,వంకాయ అని ప్రచారం చేసుకోలేదు.అదే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వంటివారు ఎల్లో మీడియా అండతో స్వర్ణాంధ్ర-2047 అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలకు తామిచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడానికి విజన్ తో పని చేస్తున్నారని చెప్పవచ్చేమో! ఇచ్చిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలా అన్నవిజన్ తో జగన్ పనిచేస్తే, చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు తాము చేసిన ప్రామిస్‌లను ఎలా ఎగవేయాలా అన్న విజన్ తో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ అటు సంక్షేమ రంగంలో కాని,ఇటు అభివృద్ది, పారిశ్రామిక రంగలో కాని, లేదా పరిపాలనను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడంలో కాని కచ్చితంగా విజన్ తో పనిచేశారని సోదాహరణంగా చెప్పవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment